విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యం మేరకు సాగకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం పనులు చేయకపోవడం.. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు సురక్షిత స్థాయికి (35 మీటర్ల ఎత్తు) పూర్తి చేయకపోవడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రక్రియ స్తంభించిన నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. గోదావరి గట్టు ఎడమ వైపు(రీచ్–1), కుడి గట్టు(రీచ్–3) వద్ద కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించలేదు. ఆ పనులు చేయొద్దని, ఆ ఖాళీ ప్రదేశాల నుంచే వరద జలాలను దిగువకు వదలాలని పీపీఏ సూచించింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ), ఆడిటెడ్ స్టేట్‌మెంట్లను సమర్పిస్తేనే మిగతా నిధులు విడుదల చేస్తామని పునరుద్ఘాటించింది. ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఆర్కే జైన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను తనిఖీ చేసింది. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ రేఖారాణిలతో పీపీఏ సమావేశమైంది.
హెడ్ వర్క్స్ పనులపై తీవ్ర అసహనం..
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) పనుల తీరుపై పీపీఏ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మే ఆఖరు నాటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తామని ఆరు నెలల క్రితం హామీ ఇచ్చారని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగలేదని వెల్లడించింది. జూన్ 15 నాటికే గోదావరికి వరదలు వస్తాయని, కాఫర్ డ్యామ్ పనులు కొనసాగిస్తే వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది గోదావరికి గరిష్టంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వరదల ధాటి నుంచి ఇప్పటిదాకా చేసిన పనులను, ముంపు గ్రామాలను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గోదావరి వరద ప్రవాహం సులభంగా దిగువకు వెళ్లేలా చేయడానికి కాఫర్ డ్యామ్‌కు ఎగువన ఏవైనా అడ్డంకులు(ఇసుక దిబ్బలు, గుట్టలు) ఉంటే వాటిని తొలగించాలని సూచించింది. కాఫర్ డ్యామ్ పనులను నిలిసివేయడంతో పాటు ఇప్పటికే చేసిన స్పిల్‌వే, స్పిల్ చానల్, కటాఫ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షించుకోవడానికి సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాలని సూచించింది. 2020 జూన్‌లోగా స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయగలిగితే.. వచ్చే సీజన్‌లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయొచ్చని, వాటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుంటుందని దిశానిర్దేశం చేసింది.
నిర్వాసితులకు ఇబ్బంది కలగొద్దు
గోదావరికి 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే 35 మీటర్ల కాంటూర్ వరకూ ముంపు గ్రామాలను వరద ముంచెత్తుతుందని, ఆయా గ్రామాల ప్రజలను జూన్ 15లోగా పునరావాస కాలనీలకు తరలించాలని పీపీఏ స్పష్టం చేసింది. 35 మీటర్ల కాంటూర్ వరకూ 18,635 కుటుంబాలు ముంపునకు గురవుతాయని, 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని, మిగతా 14,713 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆరు నెలల క్రితమే తాము అప్రమత్తం చేసినా పునరావాస కాలనీల పనులను పూర్తి చేయకపోవడంపై పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవేళ పునరావాస కాలనీల పనులు పూర్తి చేయలేకపోతే నిర్వాసితులను వరద సహాయక శిబిరాలకు తరలించాలని సూచించింది. ఒక్క నిర్వాసితుడు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.
లెక్కలు చెబితేనే మిగతా నిధులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ చేసిన వ్యయంలో రూ.4,341.95 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని, వాటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీపీఏను ఏపీ జలవనరుల శాఖ అధికారులను కోరారు. 2014 ఏప్రిల్ 1 వరకూ పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్‌మెంట్, 2014 ఏప్రిల్ 1 తర్వాత చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్‌మెంట్‌ను అడిగామని, ఇప్పటికీ ఆ లెక్కలు చెప్పలేదని పీపీఏ గుర్తుచేసింది. చేసిన ఖర్చులకు లెక్కలు చెబితేనే రీయింబర్స్ చేస్తామని తెలిపింది. పనులకు చేసిన వ్యయంతోపాటు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన ఖర్చులకు సంబంధించిన యూసీలు, ఆడిటెడ్ స్టేట్‌మెంట్‌లను ఇస్తే.. మిగతా నిధులు విడుదలయ్యేలా చూస్తామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment