RK jain
-
‘పోలవరం’లో రివర్స్ టెండరింగ్‌కు గ్రీన్ సిగ్నల్
మిగిలిపోయిన పనుల విలువనే అంతర్గత అంచనా విలువగా(ఐబీఎం) నిర్ణయించి, రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం. ఆ ధర కంటే తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తాం. దీనివల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉండదు. – రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రివర్స్ టెండరింగ్ నిర్వహణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పచ్చజెండా ఊపింది. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా, అంచనా వ్యయం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. పీపీఏ అనుమతి ఇవ్వడంతో.. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో పీపీఏ సమావేశమైంది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఏకే ప్రధాన్, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలవరం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారణ జరిపిందని, రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చి, నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రతులను పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌కు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆలోగా పనులు పూర్తి కావాలంటే హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని.. ఆ మేరకే హెడ్ వర్క్స్ నుంచి నవయుగ, బీకెమ్ సంస్థలను తొలగిస్తూ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆయా పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అంచనా వ్యయం పెరిగే అవకాశం లేదు రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరులోగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తామని, ప్రస్తుతం పోలవరం హెడ్ వర్క్స్‌లో ఉన్న యంత్రాలు, సామాగ్రిని కొత్త కాంట్రాక్టర్‌కు లీజుకు ఇప్పిస్తామని, వరదలు తగ్గుముఖం పట్టగానే నవంబర్ నుంచి కొత్త కాంట్రాక్టర్‌తో శరవేగంగా పనులు చేయిస్తామని తెలిపారు. దీనివల్ల పనుల్లో జాప్యం జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. మిగిలిపోయిన పనుల విలువనే అంతర్గత అంచనా విలువగా(ఐబీఎం) నిర్ణయించి, రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని.. ఆ ధర కంటే తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తామని, దీనివల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉండదని చెప్పారు. ఈ రివర్స్ టెండరింగ్‌లో నవయుగ, బీకెమ్ సంస్థలు కూడా పాల్గొనవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన వివరణతో పీపీఏ సీఈవో ఆర్కే జైన్ సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని, ప్రభుత్వ అభీష్టం మేరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించుకోవచ్చనని స్పష్టం చేశారు. పీపీఏ నుంచి రాతపూర్వకమైన అనుమతి రాగానే.. పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. -
వరద రాకముందే పనులు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రక్షణ పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పనుల ఏజెన్సీని ఆదేశించింది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ రక్షణ పనులు 70 శాతం పూర్తి కాగా, ఇంకా 30 శాతం చేయాల్సి ఉంది. గోదావరికి వరద వచ్చేలోగా నూరు శాతం రక్షణ పనులు చేయగలరా లేదా అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర జలవనరుల శాఖను అడిగింది. మిగిలిన 30 శాతం పనులను ఈ నెల 15వ తేదీలోగా ఎట్టిపరిస్థితుల్లోనైనా పూర్తి చేయాల్సిందేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పనులు చేస్తున్న ఏజెన్సీ నుంచి స్పష్టమైన హామీ కావాలని కోరింది. ఈ నెల 15వ తేదీలోగా కచ్చితంగా పూర్తి చేస్తామని, రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ జలాశయంలో ఇప్పటి వరకు చేసిన పనులను గోదావరి వరద నుంచి రక్షించడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, భూ సేకరణ, సహాయ పునరావాసం (ఆర్ అండ్ ఆర్) తదితర అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) గురువారం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పీపీఏ సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి బీపీ పాండే కాఫర్ డ్యామ్ రక్షణ పనుల పురోగతితో పాటు కాఫర్ డ్యామ్ 41.15 మీటర్ల లెవల్‌కు ఆర్ ఆండ్ ఆర్ పనులు పూర్తి చేయడంపై లోతుగా సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే మార్చి ఆఖరుకల్లా సహాయ, పునరావాస పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏది ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి వచ్చే ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏది ఎçప్పటిలోగా పూర్తి చేస్తారో సవివరమైన ప్రణాళికను వారంలోగా అందజేయాల్సిందిగా పీపీఏ కోరింది. ఈ పనుల్లో ఏది ముందు, ఏది తర్వాత అనేది సీక్వెన్సీగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఉంచాలని, దీని ప్రకారం పురోగతిని పర్యవేక్షిస్తామని చెప్పింది. ఈ ప్రక్రియను ఆగస్టు 1వ తేదీలోగా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదిలో చేపట్టే పనుల గురించి సమగ్ర ప్రణాళికను వచ్చే శుక్రవారానికి సమర్పిస్తామని ఈఎస్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ మిగతా పనులతో పాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు చెందిన పనులకు వెంటనే టెండర్లను పిలిచి త్వరగా పనులు పూర్తి చేయాల్సిందిగా పీపీఏ సూచించింది. డిజైన్ల అంశంపై కూడా సమీక్షించింది. రూ.5,000 కోట్ల మేర చేసిన పనులకు గాను రూ.3,000 కోట్లను విడుదల చేసేందుకు ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని, ఈ డబ్బు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి త్వరగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కోరారు. కేంద్రం నుంచి నిధులు త్వరగా ఇప్పిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు పీపీఏ సానుకూలంగా స్పందిస్తూ నిధులు విడుదలయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొంది. భూ సేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించి రూ.1,400 కోట్ల బిల్లులో రూ.1100 కోట్ల మేరకు బిల్లులను కేంద్రానికి సమర్పించారని, మిగతా రూ.300 కోట్ల బిల్లులను త్వరగా సమర్పిస్తే ఆడిట్ చేసి నిర్ణయం తీసుకుంటామని పీపీఏ సూచించింది. మిగతా బిల్లులను 15 రోజుల్లో సమర్పిస్తామని ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సీఈ మాట్లాడుతూ 50 లక్షల క్యూసెక్కుల వరదపై అధ్యయనం చేయాలని పీపీఏకు లేఖ రాశామని, దీనిపై ఏం చేశారో తెలపాలని కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ సాధారణంగా 22 లక్షల క్యూసెక్కులకే అధ్యయనం చేయాల్సి ఉండగా, 36 లక్షల క్యూసెక్కులకు అధ్యయనం చేశామని పేర్కొన్నారు. పోలవరం పూర్తవ్వడానికి మరో మూడేళ్లు : ఆర్కే జైన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అభిప్రాయపడ్డారు. పీపీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కాఫర్ డ్యామ్ రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్తలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పనులు పాక్షికంగా పూర్తయ్యాయని, వరదలు రాక ముందే పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పోలవరం డ్యామ్‌కు వచ్చే వరద వల్ల కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.6,700 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయం ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. -
చెప్పిందేమిటి చేసిందేమిటి?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యం మేరకు సాగకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం పనులు చేయకపోవడం.. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు సురక్షిత స్థాయికి (35 మీటర్ల ఎత్తు) పూర్తి చేయకపోవడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రక్రియ స్తంభించిన నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. గోదావరి గట్టు ఎడమ వైపు(రీచ్–1), కుడి గట్టు(రీచ్–3) వద్ద కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించలేదు. ఆ పనులు చేయొద్దని, ఆ ఖాళీ ప్రదేశాల నుంచే వరద జలాలను దిగువకు వదలాలని పీపీఏ సూచించింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ), ఆడిటెడ్ స్టేట్మెంట్లను సమర్పిస్తేనే మిగతా నిధులు విడుదల చేస్తామని పునరుద్ఘాటించింది. ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఆర్కే జైన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను తనిఖీ చేసింది. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్అండ్ఆర్ కమిషనర్ రేఖారాణిలతో పీపీఏ సమావేశమైంది. హెడ్ వర్క్స్ పనులపై తీవ్ర అసహనం.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) పనుల తీరుపై పీపీఏ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మే ఆఖరు నాటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తామని ఆరు నెలల క్రితం హామీ ఇచ్చారని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగలేదని వెల్లడించింది. జూన్ 15 నాటికే గోదావరికి వరదలు వస్తాయని, కాఫర్ డ్యామ్ పనులు కొనసాగిస్తే వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది గోదావరికి గరిష్టంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వరదల ధాటి నుంచి ఇప్పటిదాకా చేసిన పనులను, ముంపు గ్రామాలను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గోదావరి వరద ప్రవాహం సులభంగా దిగువకు వెళ్లేలా చేయడానికి కాఫర్ డ్యామ్‌కు ఎగువన ఏవైనా అడ్డంకులు(ఇసుక దిబ్బలు, గుట్టలు) ఉంటే వాటిని తొలగించాలని సూచించింది. కాఫర్ డ్యామ్ పనులను నిలిసివేయడంతో పాటు ఇప్పటికే చేసిన స్పిల్‌వే, స్పిల్ చానల్, కటాఫ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షించుకోవడానికి సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాలని సూచించింది. 2020 జూన్‌లోగా స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేయగలిగితే.. వచ్చే సీజన్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయొచ్చని, వాటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుంటుందని దిశానిర్దేశం చేసింది. నిర్వాసితులకు ఇబ్బంది కలగొద్దు గోదావరికి 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే 35 మీటర్ల కాంటూర్ వరకూ ముంపు గ్రామాలను వరద ముంచెత్తుతుందని, ఆయా గ్రామాల ప్రజలను జూన్ 15లోగా పునరావాస కాలనీలకు తరలించాలని పీపీఏ స్పష్టం చేసింది. 35 మీటర్ల కాంటూర్ వరకూ 18,635 కుటుంబాలు ముంపునకు గురవుతాయని, 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని, మిగతా 14,713 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆరు నెలల క్రితమే తాము అప్రమత్తం చేసినా పునరావాస కాలనీల పనులను పూర్తి చేయకపోవడంపై పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవేళ పునరావాస కాలనీల పనులు పూర్తి చేయలేకపోతే నిర్వాసితులను వరద సహాయక శిబిరాలకు తరలించాలని సూచించింది. ఒక్క నిర్వాసితుడు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. లెక్కలు చెబితేనే మిగతా నిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ చేసిన వ్యయంలో రూ.4,341.95 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని, వాటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీపీఏను ఏపీ జలవనరుల శాఖ అధికారులను కోరారు. 2014 ఏప్రిల్ 1 వరకూ పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్మెంట్, 2014 ఏప్రిల్ 1 తర్వాత చేసిన వ్యయానికి సంబంధించిన ఆడిటెడ్ స్టేట్మెంట్ను అడిగామని, ఇప్పటికీ ఆ లెక్కలు చెప్పలేదని పీపీఏ గుర్తుచేసింది. చేసిన ఖర్చులకు లెక్కలు చెబితేనే రీయింబర్స్ చేస్తామని తెలిపింది. పనులకు చేసిన వ్యయంతోపాటు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన ఖర్చులకు సంబంధించిన యూసీలు, ఆడిటెడ్ స్టేట్మెంట్లను ఇస్తే.. మిగతా నిధులు విడుదలయ్యేలా చూస్తామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు. -
పోలవరం : పీపీఏ అధికారుల సమావేశం
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. అనంతరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్కే జైన్ ఆధ్వర్యంలో నవయుగ కంపెనీ కాన్ఫరెన్స్ హాల్లో పీపీఏ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ నెల 30న విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉన్నతస్థాయి సమీక్ష జరుగనుంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పీపీఏ అధికారులు పర్యటించనున్నారు. కాగా, తాజా సమావేశంలో ప్రాజెక్టు అధికారులు నిధుల చెల్లింపు విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు ఇరిగేషన్ అధికారులపై కాంట్రాక్టు ఏజెన్సీలు ఒత్తిడి పెంచుతున్నాయి. బిల్లులు చెల్లింపులు పెండింగ్ కావడంతో ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతోంది. ప్రాజెక్టు నూతన అంచనాలకు కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం లభిస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించేందుకు నిర్దేశించిన పనులు ఎంతవరకు వచ్చాయి, పనులు ఎలా జరుగుతున్నాయని పీపీఏ బృందం పరిశీలించింది. -
పోలవరం లెక్కలు చెబితేనే నిధులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి కచ్చితమైన లెక్కలు చెబితేనే నిధులు విడుదల చేస్తామని తెగేసి చెబుతూ.. బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈవో) ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన మేరకు వివరాలివ్వకుంటే.. నిధులు విడుదల చేయాలని తాము కూడా ప్రతిపాదించలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగిస్తూ సెప్టెంబర్ 7, 2016న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 1, 2014 అంటే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వంద శాతం ఖర్చు భరిస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్ 1, 2014కు ముందు రూ.5,135.87 కోట్లు రాష్ట్రం ఖర్చు చేసింది. ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటి దాకా రూ.10,545.79 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. గతేడాది జూన్ 6 వరకూ రూ.6,727.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం విడుదల చేసింది. (పట్టపగలే గ్రావెల్ దోపిడీ) ఎన్నిసార్లు లేఖలు రాసినా లెక్కలు చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.394.37 కోట్లు విడుదల చేయాలని కోరుతూ గతేడాది జూన్ 21న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీసింగ్ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందిస్తూ ఏప్రిల్ 1, 2014కు ముందు, తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి లెక్కలు (ఆడిట్ స్టేట్మెంట్) చెబితేనే రూ.394.37 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేస్తూ గతేడాది జూలై 26న అటు కేంద్ర జలవనరుల శాఖకు, పీపీఏకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేవలం రూ.289.88 కోట్లకు మాత్రమే లెక్క చెబుతూ కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.2,620.99 కోట్లు విడుదల చేయాలని కోరుతూ గతేడాది 14న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన మేరకు వివరాలిస్తేనే నిధులు విడుదలు చేస్తామని అప్పట్లోనే పీపీఏ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.. సరికదా పోలవరానికి చేసిన వ్యయంలో కేంద్రం నుంచి ఇంకా రూ.3,818.53 కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల పీపీఏకు ప్రతిపాదన పంపింది. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర ఆర్థికశాఖ అడిగిన మేరకు వివరాలు పంపకుండా కాలయాపన చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆ లెక్కల్లోనూ తేడాలున్నాయ్.. ఇప్పటిదాకా పంపిన రూ.289.88 కోట్ల లెక్కల్లోనూ తప్పులున్నాయని.. కేంద్ర ఆర్థికశాఖ ఒకటి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మరొకటి పంపిందని పట్టిచూపారు. వ్యయానికి సంబంధించి కచ్చితమైన లెక్కలు చెప్పకుండా నిధులు విడుదల చేయాలంటూ ప్రతిపాదనలు పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. నిధుల వ్యయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆడిట్ చేయించి.. లెక్కలు చెబితే పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వం బట్టబయలవడం ఖాయమని.. అందువల్లే కేంద్ర ఆర్థిక శాఖకు లెక్కలు చెప్పకుండా ప్రభుత్వ పెద్ద మోకాలడ్డుతున్నారని అధికార వర్గాలంటున్నాయి. -
రూ. 40 కోసం రూ. 33 వేల ఖర్చు
న్యూఢిల్లీ: కేవలం 40 రూపాయల కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.33 వేలు లాయర్ ఖర్చుల కింద ఖర్చుపెట్టిందిట! ప్రజాధనాన్ని ఎందుకు ఇంతలా వృథా చేసిందో తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి, వాటిల్లో ఎన్ని పరిష్కరించారో తెలపాలంటూ ఈ మధ్య నే ఆర్కే జైన్ అనే ఆర్టీఐ కార్యకర్త ఒక దరఖాస్తు ఇచ్చారు. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా 20 పేజీల సమాచారాన్ని ఇవ్వడానికి రూ.40 చెల్లించాలంటూ ఆర్కే జైన్‌పై సీపీఐవో చేతన్ చావ్లా ఒత్తిడి తెచ్చారు. దీనిపై సమాచారకమిషన్లో తమ వాదనలు వినిపించడానికి లాయర్ ఫీజు కింద ఎన్జీటీ అధికారులు రూ. 33 వేలు చెల్లించారు. ఈ దుబారాపై మండిపడ్డ సమాచారకమిషనర్ మాఢభూషి శ్రీధర్ఆచార్యులు.. ఈ కేసులో దుబారా చేసిన అధికారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టాలని ఎన్జీటీ చైర్మన్‌ను ఆదేశించారు.