పీపీఏ సీఈవోతో ఆదిత్యనాథ్ దాస్
మిగిలిపోయిన పనుల విలువనే అంతర్గత అంచనా విలువగా(ఐబీఎం) నిర్ణయించి, రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం. ఆ ధర కంటే తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు
అప్పగిస్తాం. దీనివల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉండదు.
– రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రివర్స్ టెండరింగ్ నిర్వహణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పచ్చజెండా ఊపింది. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా, అంచనా వ్యయం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. పీపీఏ అనుమతి ఇవ్వడంతో.. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో పీపీఏ సమావేశమైంది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఏకే ప్రధాన్, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలవరం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తొలుత ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారణ జరిపిందని, రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చి, నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రతులను పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌కు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆలోగా పనులు పూర్తి కావాలంటే హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని.. ఆ మేరకే హెడ్ వర్క్స్ నుంచి నవయుగ, బీకెమ్ సంస్థలను తొలగిస్తూ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆయా పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.
అంచనా వ్యయం పెరిగే అవకాశం లేదు
రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరులోగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తామని, ప్రస్తుతం పోలవరం హెడ్ వర్క్స్‌లో ఉన్న యంత్రాలు, సామాగ్రిని కొత్త కాంట్రాక్టర్‌కు లీజుకు ఇప్పిస్తామని, వరదలు తగ్గుముఖం పట్టగానే నవంబర్ నుంచి కొత్త కాంట్రాక్టర్‌తో శరవేగంగా పనులు చేయిస్తామని తెలిపారు. దీనివల్ల పనుల్లో జాప్యం జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. మిగిలిపోయిన పనుల విలువనే అంతర్గత అంచనా విలువగా(ఐబీఎం) నిర్ణయించి, రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని.. ఆ ధర కంటే తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తామని, దీనివల్ల అంచనా వ్యయం పెరగడానికి అవకాశం ఉండదని చెప్పారు.
ఈ రివర్స్ టెండరింగ్‌లో నవయుగ, బీకెమ్ సంస్థలు కూడా పాల్గొనవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన వివరణతో పీపీఏ సీఈవో ఆర్కే జైన్ సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని, ప్రభుత్వ అభీష్టం మేరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించుకోవచ్చనని స్పష్టం చేశారు. పీపీఏ నుంచి రాతపూర్వకమైన అనుమతి రాగానే.. పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment