విజయవాడలో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రక్షణ పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పనుల ఏజెన్సీని ఆదేశించింది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ రక్షణ పనులు 70 శాతం పూర్తి కాగా, ఇంకా 30 శాతం చేయాల్సి ఉంది. గోదావరికి వరద వచ్చేలోగా నూరు శాతం రక్షణ పనులు చేయగలరా లేదా అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర జలవనరుల శాఖను అడిగింది. మిగిలిన 30 శాతం పనులను ఈ నెల 15వ తేదీలోగా ఎట్టిపరిస్థితుల్లోనైనా పూర్తి చేయాల్సిందేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పనులు చేస్తున్న ఏజెన్సీ నుంచి స్పష్టమైన హామీ కావాలని కోరింది. ఈ నెల 15వ తేదీలోగా కచ్చితంగా పూర్తి చేస్తామని, రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.
పోలవరం హెడ్ వర్క్స్ జలాశయంలో ఇప్పటి వరకు చేసిన పనులను గోదావరి వరద నుంచి రక్షించడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, భూ సేకరణ, సహాయ పునరావాసం (ఆర్ అండ్ ఆర్) తదితర అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) గురువారం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పీపీఏ సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి బీపీ పాండే కాఫర్ డ్యామ్ రక్షణ పనుల పురోగతితో పాటు కాఫర్ డ్యామ్ 41.15 మీటర్ల లెవల్‌కు ఆర్ ఆండ్ ఆర్ పనులు పూర్తి చేయడంపై లోతుగా సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే మార్చి ఆఖరుకల్లా సహాయ, పునరావాస పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఏది ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి
వచ్చే ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏది ఎçప్పటిలోగా పూర్తి చేస్తారో సవివరమైన ప్రణాళికను వారంలోగా అందజేయాల్సిందిగా పీపీఏ కోరింది. ఈ పనుల్లో ఏది ముందు, ఏది తర్వాత అనేది సీక్వెన్సీగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించి మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్‌లో ఉంచాలని, దీని ప్రకారం పురోగతిని పర్యవేక్షిస్తామని చెప్పింది. ఈ ప్రక్రియను ఆగస్టు 1వ తేదీలోగా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదిలో చేపట్టే పనుల గురించి సమగ్ర ప్రణాళికను వచ్చే శుక్రవారానికి సమర్పిస్తామని ఈఎస్‌సీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ మిగతా పనులతో పాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు చెందిన పనులకు వెంటనే టెండర్లను పిలిచి త్వరగా పనులు పూర్తి చేయాల్సిందిగా పీపీఏ సూచించింది. డిజైన్ల అంశంపై కూడా సమీక్షించింది. రూ.5,000 కోట్ల మేర చేసిన పనులకు గాను రూ.3,000 కోట్లను విడుదల చేసేందుకు ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని, ఈ డబ్బు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి త్వరగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కోరారు.
కేంద్రం నుంచి నిధులు త్వరగా ఇప్పిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు పీపీఏ సానుకూలంగా స్పందిస్తూ నిధులు విడుదలయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొంది. భూ సేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించి రూ.1,400 కోట్ల బిల్లులో రూ.1100 కోట్ల మేరకు బిల్లులను కేంద్రానికి సమర్పించారని, మిగతా రూ.300 కోట్ల బిల్లులను త్వరగా సమర్పిస్తే ఆడిట్ చేసి నిర్ణయం తీసుకుంటామని పీపీఏ సూచించింది. మిగతా బిల్లులను 15 రోజుల్లో సమర్పిస్తామని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సీఈ మాట్లాడుతూ 50 లక్షల క్యూసెక్కుల వరదపై అధ్యయనం చేయాలని పీపీఏకు లేఖ రాశామని, దీనిపై ఏం చేశారో తెలపాలని కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ సాధారణంగా 22 లక్షల క్యూసెక్కులకే అధ్యయనం చేయాల్సి ఉండగా, 36 లక్షల క్యూసెక్కులకు అధ్యయనం చేశామని పేర్కొన్నారు.
పోలవరం పూర్తవ్వడానికి మరో మూడేళ్లు : ఆర్కే జైన్
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అభిప్రాయపడ్డారు. పీపీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కాఫర్ డ్యామ్ రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్తలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పనులు పాక్షికంగా పూర్తయ్యాయని, వరదలు రాక ముందే పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పోలవరం డ్యామ్‌కు వచ్చే వరద వల్ల కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.6,700 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయం ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment