సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకునేలోగా తొలిదశ కింద ఇంకా పునరావాసం కల్పించాల్సిన తొమ్మిది వేల కుటుం బాల నిర్వాసితులకు నిధులను వేగంగా రీయింబర్స్ చేస్తామని తెలిపింది. కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.5 మీటర్ల స్థాయికి పూర్తి చేసి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో నీటిని తోడి డయాఫ్రమ్ వాల్ పటిష్టతను తేల్చడం, అగాధాల పూడ్చివేత పరీక్షలు పూర్తి చేయాలని సూచించింది.
వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌పై, అగాధాల పూడ్చివేత విధానంపై సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. ఆ మేరకు డయాఫ్రమ్ వాల్‌ను చక్కదిద్ది అగాధాలను పూడ్చి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని పేర్కొంది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. జల్ శక్తి శాఖ నిధులను త్వరితగతిన విడుదల చేసి డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుందని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు.
తొలిదశ పూర్తికి రూ.10,911 కోట్లు అవసరం..
పోలవరం తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధులపై జలవనరుల శాఖ అధికారులతో చర్చించి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 6న జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలి దశ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు జల్ శక్తి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది.
సీఎం జగన్ కృషితో కదలిక
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని మోదీతో జరిగిన ప్రతి సమావేశంలోనూ 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులివ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలో జనవరి 3న ప్రధాని మోదీతో ఢిల్లీలో సీఎం జగన్ సమావేశమై విభజన సమస్యలు పరిష్కరించడంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నియమించే కమిటీతో చర్చించేందుకు కేంద్ర కమిటీని ఏర్పాటు చేయాలని పీఎంవోని ప్రధాని మోదీ ఆదేశించారు.
ఈ క్రమంలో జనవరి 24న కమిటీల సమావేశంలో వెల్లడైన అంశాలను ఆగస్టు 22న జరిగిన భేటీలో ప్రధానికి సీఎం జగన్ వివరించారు. విభజన సమస్యలను పరిష్కరించడంతోపాటు పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు విడుదల చేయాలని వి/æ్ఞప్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పీఎంవో కమిటీ పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను పీఎంవో ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment