పోలవరం చకచకా.. | CM YS Jagan aerial survey On Polavaram Project Works progress | Sakshi
Sakshi News home page

పోలవరం చకచకా..

Published Wed, Jun 7 2023 4:16 AM | Last Updated on Wed, Jun 7 2023 7:44 AM

CM YS Jagan aerial survey On Polavaram Project Works progress - Sakshi

పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణా­లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి కీలకమైన డయా­ఫ్రమ్‌ వాల్‌ దారుణంగా దెబ్బతింది. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం కావ­డమే కాదు.. వాటిని చక్కదిద్దడం కోసం రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే.. అప్పట్లో ఆ పనులను రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు కాబట్టి. ఆ తప్పి­­దాలన్నింటినీ సరి­దిద్దుతూ.. ప్రాజె­క్టును శర­వేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయో­జనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. టీడీపీ సర్కార్‌ హయాంలో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక తిన్నెలు కోతకు గురై ఏర్పడిన అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో డయా­ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట్ల కొత్తగా సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ఈ పనులు పూర్తయితే.. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వాటి మధ్య గోదావరి వరదల్లోనూ ఈసీఆర్‌ఎఫ్‌ (ప్రధాన) డ్యామ్‌ పనులు చేపట్టి.. గడువులోగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు. మంగళవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌.. 9.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత హెలికాఫ్టర్‌ దిగి నేరుగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే వద్దకు చేరుకున్నారు. 

మండుటెండలో కలియతిరుగుతూ..
మండుటెండలో తీవ్రమైన ఉక్కపోత మధ్య సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టు పనులను ఒక గంటా 40 నిమిషాలపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, గైడ్‌ వాల్‌లను పరిశీలిస్తూ.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు చేరుకున్నారు. గత సీజన్‌లో వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచిన పనులను పరిశీలించారు. టీడీపీ సర్కార్‌ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో రెండు వైపులా 800 మీటర్లు ఖాళీ వదిలేసి, అరకొరగా చేసిన పనులను.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 44 మీటర్ల ఎత్తుతో పూర్తయిన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను పరిశీలించారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను పరిశీలిస్తూ.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు చేరుకున్నారు. గోదావరి వదరల ఉధృతికి దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాన్ని పూడ్చి.. 31.5 మీటర్ల ఎత్తుతో ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసిన ఆ డ్యామ్‌ను పరిశీలించారు.

ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలలో ఇసుకను నింపి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను నిశితంగా పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించడంపై అధికారులతో చర్చించారు. 

సీఎం చొరవ వల్లే నిధులు 
క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్దే మీటింగ్‌ హాల్‌లో జల వనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశను పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం జారీ చేసిందని జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సీఎంకు వివరించారు.

గత ప్రభుత్వం ప్రణాళిక లోపంతో చేపట్టిన పనుల వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి యథా స్థితికి తేవడం, డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాల కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు. బిల్లుల చెల్లింపులో కాంపొంనెంట్‌(విభాగాల) వారీ విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని అధికారులు వివరించారు. మీ (సీఎం) చొరవ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. 

చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు 
గైడ్‌ వాల్‌లో ఏర్పడిన చిన్న సమస్యను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లతోనే గైడ్‌ వాల్‌ పనులు చేశామని చెప్పారు. ప్రస్తుత సమస్యను కూడా సీడబ్ల్యూసీకి నివేదించామన్నారు. గైడ్‌ వాల్‌లో ఉత్పన్నమైన సమస్యను సరిదిద్దడం పెద్ద విషయం కాదని.. సీడబ్ల్యూసీ అధికారులు పరిశీలించాక.. వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని వివరించారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు.

వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్య మీడియా మన రాష్ట్రంలో ఉందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌ వాల్‌లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపించే ప్రయత్నం చేస్తున్నారని,  దీన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని సరిదిద్దే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి పినిపే విశ్వరూప్, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 
 
కీలక పనుల్లో గణనీయమైన ప్రగతి 
పోలవరం ప్రాజెక్టులోని కీలక పనుల్లో ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామని.. 48 రేడియల్‌ గేట్లను పూర్తి స్థాయిలో అమర్చామని.. రివర్‌ స్లూయిస్‌ గేట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పూర్తయిందని చెప్పారు. జల విద్యుత్కేంద్రంలో సొరంగాల తవ్వకం పూర్తయిందని.. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాన్ని ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు పూర్తయ్యాయన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను నింపడానికి అవసరమైన ఇసుకను వంద శాతం ఆ ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఆ ఇసుకను అగాధాలలో నింపే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–1 పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

గ్యాప్‌–2లో యధాస్థితికి తెచ్చే పనులను త్వరగా పూర్తి చేసి.. వీలైనంత తొందరగా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలన్నారు. ఈ పనులు పూర్తయితే.. గ్యాప్‌–2లో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టి.. వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించడం ద్వారా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్యాప్‌–2 నిర్మాణ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత, కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. 

పునరావాసం కల్పనపై ప్రత్యేక దృష్టి 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 20,946 నిర్వాసిత కుటుంబాలకుగాను 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించామని చెప్పారు. మరో 8,288 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగంగా చేస్తున్నామన్నారు.

గతేడాది నిర్వహించిన లైడార్‌ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్‌లోకి 36 గ్రామాలు వస్తాయని తేలిందని, ఆ గ్రామాల్లోని 16,642 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక.. షెడ్యూలు ప్రకారం నిర్వాసితులను అక్కడికి తరలించాలని సూచించారు. 

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి 
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌  అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకట్టుకునేలా బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. పర్యాటకుల కోసం అధునాతన సదుపాయాలతో హోటల్‌ ఏర్పాటు చేయాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement