పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పైనుంచి పనులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలి. పోలవరంలో తొలి ఏడాదే 41.15 మీటర్లలో 120 టీఎంసీల దాకా నిల్వ చేసే సామర్థ్యం వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆ తర్వాత దశలవారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్) 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తాం. ప్రాజెక్టు ఎత్తును ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించడం లేదు.
– పోలవరం వద్ద సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్‌లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రూ.3,330 కోట్లతో వచ్చే మార్చి నాటికి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాస కల్పన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ 10.25 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనుల పురోగతిపై తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్) పనుల పురోగతిని నిశితంగా గమనించారు. తరువాత ప్రాజెక్టు వద్దే జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ, సహాయ, పునరావాస విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
మే చివరికి స్పిల్ వే, స్పిల్ చానల్ పూర్తి..
జూన్ నుంచి గోదావరిలో వరద ప్రారంభమవుతుందని, ఆలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ఎక్కడ జాప్యం జరిగినా మళ్లీ ఒక సీజన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు సూచించారు. వచ్చే మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని స్పష్టం చేశారు.
సమాంతరంగా జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు..
మే ఆఖరు నాటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని, ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడం ద్వారా వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్) పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. జలాశయం పనులకు సమాంతరంగా జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు.
పునరావాసంపై ప్రత్యేక దృష్టి..
పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడంతోపాటు అదే వేగంతో నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్) పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ నిర్దేశించారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు జలాశయాల నిర్మాణం పూర్తయినా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయామని గుర్తు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా గతంలో ఏ రోజూ 3 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్‌అండ్‌ఆర్‌ను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చిత్రావతి ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.240 కోట్లు ఇచ్చి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పది టీఎంసీలను నిల్వ చేసిందని తెలిపారు. గండికోటలో 20, కండలేరులో 60 టీఎంసీలు నిల్వ చేశామని వివరించారు.
గోదావరి డెల్టాకు సమృద్ధిగా సాగునీరు..
పోలవరం కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసే సమయంలో గోదావరి డెల్టా రైతులకు సాగు, తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళికను ప్రజాప్రతినిధులకు తెలియజేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు. పోలవరం నిర్మాణంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కమిటీలో జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
కేంద్రానికి ఎప్పటికప్పుడు బిల్లులు..
పోలవరం బిల్లులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తద్వారా రీయింబర్స్‌మెంట్ నిధులను వేగంగా రాబట్టవచ్చన్నారు. 2018 బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని సీఎం ప్రస్తావించారు. రీయింబర్స్‌మెంట్ కాకుండా పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న నేపథ్యంలో కొంత మేర నిధులను అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పీపీఏ అధికారులకు సీఎం సూచించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యామ్ ఎత్తుపై విపక్షాల దుష్ప్రచారం..
పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. డ్యామ్ ఎత్తును ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించడం లేదని స్పష్టం చేశారు. డ్యామ్ డిజైన్ ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ 45.72 మీటర్లు ఉంటుందని తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడ జలాశయాలను నిర్మించినా మొదట ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయరన్నారు. అయినప్పటికీ పోలవరంలో 41.5 మీటర్లలో తొలి దశలోనే 120 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేసే సామర్థ్యం వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు మార్చి నాటికి ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేసేందుకు రూ.3,330 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ, జలాశయంలో నీటి నిల్వను పెంచుకుటూ 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తామని వివరించారు. పోలవరం డ్యామ్ ఎత్తుపై లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడం లేదని పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి సమీక్షలో పలుమార్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment