సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి కచ్చితమైన లెక్కలు చెబితేనే నిధులు విడుదల చేస్తామని తెగేసి చెబుతూ.. బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈవో) ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన మేరకు వివరాలివ్వకుంటే.. నిధులు విడుదల చేయాలని తాము కూడా ప్రతిపాదించలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగిస్తూ సెప్టెంబర్ 7, 2016న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 1, 2014 అంటే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వంద శాతం ఖర్చు భరిస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్ 1, 2014కు ముందు రూ.5,135.87 కోట్లు రాష్ట్రం ఖర్చు చేసింది. ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటి దాకా రూ.10,545.79 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. గతేడాది జూన్ 6 వరకూ రూ.6,727.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం విడుదల చేసింది. (పట్టపగలే గ్రావెల్ దోపిడీ)
ఎన్నిసార్లు లేఖలు రాసినా లెక్కలు చెప్పని రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.394.37 కోట్లు విడుదల చేయాలని కోరుతూ గతేడాది జూన్ 21న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీసింగ్ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందిస్తూ ఏప్రిల్ 1, 2014కు ముందు, తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయానికి లెక్కలు (ఆడిట్ స్టేట్‌మెంట్) చెబితేనే రూ.394.37 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేస్తూ గతేడాది జూలై 26న అటు కేంద్ర జలవనరుల శాఖకు, పీపీఏకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేవలం రూ.289.88 కోట్లకు మాత్రమే లెక్క చెబుతూ కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.2,620.99 కోట్లు విడుదల చేయాలని కోరుతూ గతేడాది 14న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన మేరకు వివరాలిస్తేనే నిధులు విడుదలు చేస్తామని అప్పట్లోనే పీపీఏ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.. సరికదా పోలవరానికి చేసిన వ్యయంలో కేంద్రం నుంచి ఇంకా రూ.3,818.53 కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల పీపీఏకు ప్రతిపాదన పంపింది. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర ఆర్థికశాఖ అడిగిన మేరకు వివరాలు పంపకుండా కాలయాపన చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును
ఆ లెక్కల్లోనూ తేడాలున్నాయ్..
ఇప్పటిదాకా పంపిన రూ.289.88 కోట్ల లెక్కల్లోనూ తప్పులున్నాయని.. కేంద్ర ఆర్థికశాఖ ఒకటి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మరొకటి పంపిందని పట్టిచూపారు. వ్యయానికి సంబంధించి కచ్చితమైన లెక్కలు చెప్పకుండా నిధులు విడుదల చేయాలంటూ ప్రతిపాదనలు పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. నిధుల వ్యయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆడిట్ చేయించి.. లెక్కలు చెబితే పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వం బట్టబయలవడం ఖాయమని.. అందువల్లే కేంద్ర ఆర్థిక శాఖకు లెక్కలు చెప్పకుండా ప్రభుత్వ పెద్ద మోకాలడ్డుతున్నారని అధికార వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment