సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విజయవాడలోని సూర్యరావుపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ గృహంలో ఆయన నివసిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద కాపలా ఉండే సెక్యూరిటీ గార్డే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురికావడంతో చోరీ జరిగిన విషయాన్ని ఇటు ఐఏఎస్ అధికారి, అటు పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ.85 లక్షల నగదు, రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిసింది. దాదాపు నెల రోజుల కిందట ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అంత భారీ స్థాయిలో నగదు ఇంట్లో ఉన్న విషయం బయటికి పొక్కితే ఐటీ, ఏసీబీ, సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని తెలిసి శశిభూషణ్ కుమార్ తూతూ మంత్రంగా కేసు పెట్టారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని కొంత సొమ్ము రికవరీ చేశారు. ఎంత సొమ్ము చోరీకి గురైంది? ఆభరణాల విలువ ఎంత? అనే వివరాలు మాత్రం వెల్లడించడానికి ఇరువర్గాలు ఇష్టపడకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటో అంతుచిక్కడం లేదు.
చోరుడు.. సెక్యూరిటీగార్డే
శశిభూషణ్‌కుమార్ ఇంటి వద్ద హైదరాబాద్‌లోని మెట్రో సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బిస్వాస్‌ను సెక్యూరిటీ గార్డుగా నియమించుకున్నారు. బిస్వాస్‌ది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న అతన్ని అధికారి కుటుంబసభ్యులు కూడా చేరదీసి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కుటుంబసభ్యుడిలాగే ఇంట్లోకి రానిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో భారీ ఎత్తున సొమ్ము సూట్‌కేసులో దాచి ఉంచిన విషయాన్ని గుర్తించిన బిస్వాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగదుతోపాటు విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన శశిభూషణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొంత సమయం తీసుకున్నారు.
అనంతరం జరిగిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పి సాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ముఖ్యనేత ఒకరు ఈ కేసును రహస్యంగా నమోదు చేసి చోరీ అయిన సొత్తు రికవరీ చేయించాలని సూచించినట్లు తెలిసింది. సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి.. అనంతరం టాస్క్‌ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. నిందితుడి కోసం వేట కొనసాగించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో నిందితుడు తలదాచుకున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి బిస్వాస్‌ను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. నిందితుడు బంగారు నగలతోపాటు చాలా మొత్తంలో నగదు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలే నగదుకు సంబంధించిన లెక్కలు ఏవీ లేకపోవడంతో ఐఏఎస్ అధికారి కూడా కిమ్మనకుండా అతడి వద్ద నుంచి పోలీసులు రికవరీ చేసిన దానితోనే సంతృప్తి చెందినట్లు సమాచారం.
అంతా రహస్యమే..
సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కానీ, ఆయన తూతూ మంత్రంగా కేసు ఎందుకు పెట్టినట్లు? నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేసిన సొత్తు కూడా అంతంత మాత్రమే అని తెలిసినా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. బంగారు ఆభరణాలకు సంబంధించిన లెక్కలు చూపినా.. పెద్ద ఎత్తున ఇంట్లో ఉంచుకున్న నగదు గురించి చెప్పేదెలా? ఒకవేళ చెబితే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. అదేసమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో పైస్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి సిఫార్సులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి.. చోరీ సొత్తును రికవరీ చేసి మూడో కంటికి తెలియకుండా నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చోరీ జరిగిన ఘటనపై ‘సాక్షి’ పోలీసు అధికారులను వివరాలు కోరగా.. అందరి వద్ద నుంచీ ఆ కేసు వివరాలు తెలియదనే సమాధానం రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment