సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగి కూడా రిటైర్ కావడం లేదు. అయితే 2024 నుంచి 2031 వరకు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయనుండటంతో పెన్షన్ల వ్యయం భారీగా పెరగనుంది. ఆ సమయంలో ఏటా దాదాపు 13 వేల నుంచి 16 వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు.
ఏకంగా 1,17,355 మంది పదవీ విరమణ చేయనున్నారు. పెన్షన్ల వ్యయం ప్రస్తుతం రూ.17,204.79 కోట్లు వరకు ఉండగా 2024లో ఏకంగా రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ అంశాలను వెల్లడించింది. 2031లో పెన్షన్ల వ్యయం రూ.34,251.89 కోట్లకు చేరుతుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. 2022 నుంచి 2031 వరకు పెన్షన్లకు మొత్తం రూ.2,73,780.40 కోట్లు వ్యయం కానుందని తెలిపింది.
పెంపుతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం
పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. సగటున నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచడంతో రూ.24 లక్షల మేర ప్రయోజనం కలగనుంది. సగటు ఉద్యోగికి రెండేళ్లలో రూ.14.40 లక్షల చొప్పున ఆర్థిక ప్రయోజనం కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment