నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉండడం, అలాగే దిగువ స్థాయిలోనే కొనసాగుతున్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు నేపథ్యంలో ఆర్‌బీఐ మంగళవారం పావుశాతం రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.75 శాతం) మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందని కొందరు బ్యాంకర్లు అభిప్రాయపడుతుండగా, దీనికి సంబంధించి తదుపరి నిర్ణయానికి 28వ తేదీ బడ్జెట్ వరకూ ఆర్‌బీఐ వేచిచూసే అవకాశం ఉందని మరికొందరి విశ్లేషణ.
దాదాపు 20 నెలల తరువాత అనూహ్యంగా జనవరి 15న ఆర్‌బీఐ రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి (పావుశాతం) తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, ద్రవ్య పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలపై ఆధారపడి తదుపరి రేట్ల కోత ఉంటుందని కూడా సూచించింది. ఈ రెండు అంశాలూ ప్రస్తుతం సానుకూలంగా ఉండడం, పాలక, పారిశ్రామిక వర్గాల ‘తాజా పావుశాతం రేట్ల కోత’ ఆశలకు ఊపిరిలూదుతోంది.