పాలసీ రేట్లు యథాతథం.. | RBI policy: Raghuram Rajan just made Arun Jaitley's budget math tougher | Sakshi
Sakshi News home page

పాలసీ రేట్లు యథాతథం..

Published Wed, Feb 3 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

పాలసీ రేట్లు యథాతథం..

పాలసీ రేట్లు యథాతథం..

రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వ చర్యలపైనే దృష్టి..
ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం రిస్కుల ప్రభావం
రెపో రేటు 6.75 శాతం,
రివర్స్ రెపో 5.75%, సీఆర్‌ఆర్ 4 శాతంగా కొనసాగింపు
ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 7.4 శాతం
♦  తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 5న...

 
 అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ  గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి పాలసీ  సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. కీలక పాలసీ  వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రేట్ల కోత అంశాన్ని కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టారు. రానున్న బడ్జెట్‌లో నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం చేపట్టే చర్యలు, స్థూల ఆర్థిక  అంశాలకు అనుగుణంగా భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని రాజన్ స్పష్టం చేశారు. వృద్ధి మందగమనం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు కూడా ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

 ముంబై: రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారీ ఎక్కడి రేట్లను అక్కడే వదిలిపెట్టింది. మంగళవారం నిర్వహించిన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును ఇప్పుడున్న 6.75 శాతం వద్దే ఉంచుతున్నట్లు ప్రకటించింది. రివర్స్ రెపో రేటు 5.75ు, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని 4%గా కొనసాగించింది. తాజా సమీక్షలో ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని అత్యధిక శాతం మంది విశ్లేషకులు, బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఏడాదిలో 4 సార్లు పావు శాతం చొప్పున(1.25%) రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించింది. తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 5న ఉంటుంది.

 వృద్ధి రేటు అంచనాల్లో మార్పుల్లేవు...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన విధంగా 7.4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో ఇది తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ వృద్ధి అంచనా 7.3 శాతం కంటే ఇది అధికమే కావడం గమనార్హం. ఇక వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 7.6 శాతానికి పెరగవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. వరుసగా రెండేళ్లపాటు వర్షపాతం కొరత తర్వాత రానున్న సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయని, దీంతోపాటు కంపెనీల ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రజల వాస్తవా ఆదాయాలు మెరుగుపడుతుండటం వంటివి వృద్ధి పుంజుకోవడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.

 మొండిబకాయిలపై వెనక్కితగ్గం...
 బ్యాంకుల్లో భారీగా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యను తగ్గించడంపై ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మొండిబకాయిలుగా మారే అవకాశం ఉన్న 150 కీలక ఖాతాలను గుర్తించిన ఆర్‌బీఐ.. వీటికి ఎన్‌పీఏలుగా పరిగణించి తగినవిధంగా కేటాయింపులను(ప్రొవిజనింగ్) చేయాల్సిందిగా బ్యాంకులను ఇప్పటికే ఆదేశించింది. ఈ ప్రభావంతో బ్యాంకులు దాదాపు రూ.70 వేల కోట్లను ప్రొవి జనింగ్ రూపంలో కేటాయించాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆర్‌బీఐ ఇప్పటికే డెడ్‌లైన్  విధించింది. కాగా, తాము చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం కావడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో భవిష్యత్తు అవసరాలకు తగిన నిధులను అందించేలా బ్యాంకులు సంసిద్ధమవుతాయని రాజన్ పేర్కొన్నారు.
 
 ఇప్పటికీ మాది సరళ విధానమే..
 ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకరించడం, వృద్ధికి సానుకూల పరిస్థితులను కల్పించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి పలు చర్యలను చేపడతామని ప్రభుత్వం చెబుతూవస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నెల 29 సమర్పించనున్న బడ్జెట్‌లో వీటిపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేదానిపైనే మేం దృష్టిపెట్టాం. నిర్మాణాత్మక సంస్కరణలతో వృద్ధికి ఊతం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యయాలను అదుపు చేస్తే దీనివల్ల రేట్ల కోతకు అవకాశాలు పెరుగుతాయి. అంతిమంగా ఆర్థిక వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఈ ఏడాది జనవరి ద్రవ్యోల్బణం లక్ష్యం 6 శాతాన్ని కచ్చితంగా అందుకుంటాం.

వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. అంతర్జాతీయంగా భారీగా దిగొచ్చిన ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగడం, ఈసారి వర్షాలు సరిగ్గా కురవడం, రూపాయి మారకం విలువ వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సరళ పాలసీ ధోరణినే ఇప్పటికీ మేం కొనసాగిస్తున్నాం. మా లక్ష్యానికి అనుగుణంగానే ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. అయితే, రానున్న కాలంలో ద్రవ్యోల్బణం ధోరణి ఎలా ఉంటుందనే గణాంకాల కోసం వేచిచూస్తున్నాం. దీన్ని దృష్టిలోపెట్టుకునే ఈసారి పాలసీ నిర్ణయం తీసుకున్నాం.
                                      - రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ గవర్నర్
 
 స్టార్టప్‌లకు చేయూత
 దేశంలో స్టార్టప్ సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహానికి ఆర్‌బీఐ కూడా తన వంతు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ఎంట్రప్రెన్యూర్లు పలు చోట్లకు తిరగాల్సిన పనిలేకుండా నిబంధనలను సరళతరం చేస్తున్నట్లు రాజన్ ప్రకటించారు. ‘స్టార్టప్‌ల ఏర్పాటు ప్రక్రియను సరళం చేయాలన్నదే మా ఉద్దేశం. దేశీయంగా, విదేశాల నుంచి నిధులను సులువుగా సమీకరించే వీలు కల్పిస్తాం. అన్ని రకాల దరఖాస్తు ఫారాలనూ ఆన్‌లైన్‌లో ఉంచుతాం’ అని రాజన్ పేర్కొన్నారు.
 
 రెపో రేటు: బ్యాంకులు స్వల్పకాలిక అవసరాల కోసం తీసుకునే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు.
 రివర్స్ రెపో: ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై వాటికి లభించే వడ్డీరేటు.
 సీఆర్‌ఆర్: బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన పరిమాణం.
 
 వచ్చే ఆర్థిక సంవత్సరం  0.75 శాతం కోత: బ్యాంకర్ల అంచనా
మంగళవారం పాలసీ నిర్ణయం ముందుగా ఊహించిందేనని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ముప్పావు శాతం (0.75 శాతం) రెపో రేటు కోత ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

{దవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగానే రేటు కోత ఉంటుందని తాము అంచనా వేసినట్లు ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్య లభ్యత కోసం ఆర్‌బీఐ తగిన ఆర్థిక సాధనాలను వినియోగించాలని కోరారు.

♦  బడ్జెట్, ద్రవ్యోల్బణం అంచనాలు, వృద్ధి ధోరణులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్‌బీఐ తగిన నిర్ణయం తీసుకుందని తాను భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పేర్కొన్నారు.

 ♦  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అభీక్ బారువా మాట్లాడుతూ, అంతర్జాతీయ ధోరణికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ద్రవ్య సరళతర విధానంవైపు ఆర్‌బీఐ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అయితే ఈ ఏడాది పావు శాతం నుంచి అరశాతం వరకూ రెపో రేటు కోత ఉండే అవకాశం ఉందని మాత్రం ఆయన అన్నారు.

వృద్ధికి రేటు కోత తప్పదు: పరిశ్రమ: ఆర్‌బీఐ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. నిధుల సమీకరణ వ్యయం తగ్గడానికి, పెట్టుబడుల పురోభివృద్ధికి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి రేటు కోత తప్పనిసరని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బడ్జెట్ తరువాత ఈ దిశలో ఆర్‌బీఐ చర్యలు ఉంటాయన్నది కూడా తమ అభిప్రాయమని అన్నారు.

డిమాండ్ ఇంకా బలహీనంగా ఉందని, నిధుల భారం తగ్గలేదని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్థన్ నోటియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

♦  {దవ్యోల్బణం, ద్రవ్యలోటులపై ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ప్రభావం రేటు కోత అవకాశాలను దెబ్బతీస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement