సంస్కరణల అమలు సులువేం కాదు..
* రాజకీయంగా అనేక అడ్డంకులున్నాయి...
* ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు
భువనేశ్వర్: భారత్‌లో నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం రాజకీయంగా కష్టతరమైన అంశమేనని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల మొండిబకాయిల సమస్యను పరిష్కరించడం, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా వృద్ధిని పరుగులు పెట్టించవచ్చని చెప్పారు. అదేవిధంగా కార్మిక సంస్కరణలు కూడా వృద్ధి జోరుకు దోహదం చేస్తాయని, అయితే దీనికి రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఉండొచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు.
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ-భారత్’ అనే అంశంపై ఆయన చేసిన ఒక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్ వంటి వర్ధమాన దేశాలు తమ గొంతును మరింత బలంగా వినిపించాల్సిందేనని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి ప్రభావం నుంచి భారత్ సురక్షితంగానే ఉందని చెప్పారు. ‘వరుసగా రెండేళ్లు కరువు, ప్రపంచ మార్కెట్లో డిమాండ్ బలహీనతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ... మనం 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నాం.
దీనికి స్థూల ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వమే కారణం. అయితే, దీన్ని ఇదేవిధంగా కొనసాగించాలంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, బ్యాంకుల మొండిబకాయిల సమస్యకు తగిన పరిష్కారం చూపడం వంటివి కీలకం. అదేవిధంగా సంస్కరణల కొనసాగింపు ద్వారా దేశీ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలవుతుంది. ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునేలా చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యం. అయితే, రాజకీయంగా ఇది కష్టసాధ్యమైన విషయమే’ అని రాజన్ వివరించారు.
రాజన్‌కు మరో అవకాశం ఇవ్వాలి: ఆది గోద్రెజ్
మరికొద్ది నెలల్లో ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల గడువు ముగియనున్న నేపథ్యంలో రఘురామ్ రాజన్‌కు పారిశ్రామిక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రాజన్‌ను స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అభివర్ణించిన దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్.. ఆయన్ను గవర్నర్‌గా మరోవిడత కొనసాగిస్తే భారత్‌కు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2013 సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన రాజన్ మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది.
కాగా, దేశ ఆర్థిక వ్యవస్థను రాజన్ ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీశారని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వామి ప్రధానికి లేఖ కూడా రాశారు. అయితే, ఈ వివాదంపై స్పందించేందుకు గోద్రెజ్ నిరాకరించారు. ‘ఇతర వ్యక్తులు ఏమన్నారన్నదానిపై నేను వ్యాఖ్యానించను.
ప్రపంచవ్యాప్తంగా రాజన్‌కు అత్యంత గౌరవమర్యాదలు ఉన్నాయి. అనేక బిజినెస్ మ్యాగజీన్స్ ఆయనను అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎంపికచేశాయి. ఆయన గవర్నర్ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. మరోసారి అవకాశం ఇవ్వడం దేశానికే మంచిది. అందుకే నేను ఆయన బాధ్యతల పొడిగింపునకు మద్దతిస్తున్నా’ అని గోద్రెజ్ వ్యాఖ్యానించారు.