మొండి బకాయిలకు ఇక బ్రేక్
ఈ సమస్యనుంచి గట్టెక్కుతాం
* ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ధీమా
* పటిష్ట దేశాభివృద్ధే ఏకైక లక్ష్యమని ఉద్ఘాటన
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిలు (ఎన్పీఏ) తారస్థాయికి చేరిపోయాయని, ఇక్కడ్నుంచి పెరిగే అవకాశం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్టీల్, విద్యుత్, రహదారులు, చక్కెరసహా ఒత్తిడిలో ఉన్న ఆరు ప్రధాన రంగాలు- మెరుగుపడుతున్నాయని.. ఇది ఎన్పీఏల విషయంలో పరిస్థితి కుదుటపడ్డానికి దారితీస్తుందని అన్నారు.
తగిన వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో దేశాభివృద్ధి మరింత వేగవంతం కావడం ఖాయమని పేర్కొన్నారు. గ్రామీణ డిమాండ్ పెరగడం, పెట్టుబడులు వేగవంతం కావడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడేవిగా వివరించారు. వేగవంతమైన దేశాభివృద్ధి రేటు సాధనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్... ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయా అంశాలను క్లుప్తంగా చూస్తే...
సంస్కరణలపై వెనక్కు తగ్గం...
సంస్కరణలపై ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా త్వరలో వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తుందని విశ్వసిస్తున్నాం. యూపీఏ మిత్రపక్షాల్లో కొన్ని దీనికి మద్దతు నిస్తున్నాయి. కాంగ్రెస్ దీనిని అడ్డుకోవడం తగదు. ఏకాభిప్రాయ సాధనకు చేయాల్సింది అంతా చేస్తాం. లేదంటే పార్లమెంటరీ వోటే ప్రత్యామ్నాయం. ఇక దివాలా బిల్లు ఆమోదం తరువాత ముఖ్యమైన నాలుగైదు సంస్కరణల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ త్వరగా అమలు జరగడానికి ప్రభుత్వం తగినచర్యలు అన్నీ తీసుకుంటుంది.
సింగపూర్‌తోనూ ‘పన్ను’ ఒప్పందం: మారిషస్ ద్వారా షేర్లలో పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును భారత్‌లో విధించడానికి సంబంధించి ఇటీవల ఆ దేశంతో జరిగిన ఒప్పందం కీలకమైనది. ఈ తరహా ఒప్పందాన్నే సింగపూర్‌తో కూడా చేసుకోవాల్సి ఉంది. ఇందుకు తగిన చర్చలను ఆర్థిక శాఖ అధికారులు జరుపుతున్నారు. అయితే ఎప్పటిలోగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయో చెప్పలేను.
ఆర్బీఐతో సంబంధాల ‘పరిపక్వత’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో ఆర్థిక మంత్రిత్వశాఖకు పరిపక్వతతో కూడిన సంబంధాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ పరస్పర సహకారంతో ప్రభుత్వం-ఆర్బీఐ ముందుకు వెళుతున్నాయని కూడా జైట్లీ చెప్పారు. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌ను మరోవిడత కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు... అది ఇప్పుడు అనవసర విషయం అంటూ సమాధానాన్ని దాటవేశారు.
మాల్యాను వెనక్కు తెచ్చే యత్నం...
బ్యాంకింగ్ రుణ ఎగవేతల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యాను లండన్ నుంచి తీసుకురావడానికి భారత్ విచారణా సంస్థలు తగిన అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ‘మాల్యాను బహిష్కరించలేమంటూ బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో... ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలయిన తర్వాత బ్రిటన్ను ఆయనను ‘అప్పగించాలని’ కోరడానికి సంబంధించిన ప్రక్రియను భారత్ ప్రారంభిస్తుంది. రుణ బకాయిలను రాబట్టుకోడానికి బ్యాంకులు కూడా తగిన ప్రయత్నం అంతా చేస్తాయి. విచారణా సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తాయి’ అని ఆర్థిక మంత్రి చెప్పారు.