మహిళలంటే షాపింగేనా? ఆర్థిక విషయాల్లో వారి ప్లాన్స్‌ తెలిస్తే ! | DBS Bank India and CRISIL study reveals indian women financial plans | Sakshi
Sakshi News home page

మహిళలంటే షాపింగేనా? ఆర్థిక విషయాల్లో వారి ప్లాన్స్‌ తెలిస్తే !

Jan 17 2024 5:18 PM | Updated on Jan 17 2024 6:56 PM

DBS Bank India and CRISIL study reveals indian women financial plans - Sakshi

మహిళలు షాపింగ్‌ చేయడంలో ముందుంటారు. కానీ, కుటుంబ శ్రేయస్సు కోసం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం వెనకుంటారు.. అనేది నాటి మాట. నేడు ఈ మాటను తిరుగ రాస్తోంది మెట్రో మహిళ. ఈ విషయాన్ని డీబీఎస్‌బ్యాంక్, ఇండియన్‌ క్రిసిల్‌ చేసిన సర్వేలో స్పష్టమైంది. 

మెట్రో నగరాలలో జీవిస్తున్న భారతీయ మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారని  తెలియజేసిన డీబీఎస్‌–ఇండియా క్రిసిల్‌ సర్వేలో దేశంలోని పది నగరాల్లో 800 మంది మహిళలు ΄ాల్గొన్నారు. మహిళలు–ఆర్థిక ప్రగతి పేరుతో చేసిన ఈ అధ్యయనంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల ప్రాధాన్యతను ఈ సర్వే ప్రత్యేకంగా పేర్కొంది.  

పొదుపు ఖాతాలు
పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో ఎక్కువమంది సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు,  పొదుపు ఖాతాల వంటి సంప్రదాయక ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. కుటుంబంలో దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భారతదేశంలోని 98 శాతం మంది ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు గణనీయమైన మార్పును కోరుకుంటున్నారు. వయస్సు, ఆదాయం, వైవాహిక స్థితి, ఆధారపడిన వారు, ఇంటి స్థానం వంటి అంశాలు మహిళల ఆర్థిక ప్రవర్తనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. 

ఫైనాన్స్‌పై మహిళల అవగాహన 
పట్టణాల్లో పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరగడం, వారి ఆర్థిక ప్రాధాన్యతలు వయసుతో΄ాటు ఎలా మారుతున్నాయో హైలైట్‌ చేస్తుంది ఈ నివేదిక. వైవాహిక స్థితి, వృత్తిపరమైన నిర్ణయాలు, వ్యక్తిగత ఆరోగ్యం, జీవితంలో ఊహించని సంఘటనలు వంటి అంశాలు వివిధ దశల్లో మహిళల ఆర్థిక ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు.. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళలు ఇంటిని కొనుగోలు చేయడం లేదా అప్‌గ్రేడ్‌ చేయడం, 35-45 సంవత్సరాల మధ్య ఉన్న వారు పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైద్య సంరక్షణకు మారడం వంటి వాటికి ఎలా  ప్రాధాన్యత నిస్తున్నారో నివేదిక హైలైట్‌ చేస్తుంది. 

వయసు ప్రాధాన్యంగా..
మహిళల నిర్ణయాలు, వారి వయసు ఆర్థిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 65 శాతం మంది స్వయం ప్రతిపత్తి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబ నాయకత్వంలో ఎదిగారు. దాదాపు 47 శాతం మంది మహిళలు స్వావలంబనతో కూడిన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్య్రాన్ని నొక్కి చెబుతోందని ఫలితాలు సూచించాయి. ఆర్థిక నిర్ణయాలపైన లీడర్‌షిప్, విభిన్న పెట్టుబడి, లోన్లు, పెరుగుతున్న డిజిటల్‌ ఛానెల్స్‌ స్వీకరణ ఇవన్నీ ఆధునిక భారతీయ మహిళ కేవలం భాగస్వామిగా మాత్రమే కాదు, జీవన ప్రయాణాన్ని  ప్లాన్‌ చేస్తోంది. 

ఎలా పొదుపు చేస్తున్నారంటే..
మహిళల ఆర్థిక మార్గాలు వారి వ్యక్తిత్వంలానే భిన్నంగా ఉంటున్నాయి. పొదుపు చేయడం, రుణం తీసుకోవడం, పెట్టుబడి విధానం, వయసు, ఆదాయం, సాంస్కృతిక నేపథ్యం, వనరులను పొందడం వంటి అనేక అంశాలు పొదుపు మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక సర్వే ప్రకారం.. మెట్రో పాలిటన్‌ ప్రాంతాల్లో సంపాదించే మహిళలు తక్కువ రిస్క్‌ పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నారు. వారి నిధులలో 51 శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలకు కేటాయిస్తున్నారు.  బంగారంలో 16 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో 15 శాతం, రియల్‌ ఎస్టేట్‌లో 10 శాతం, స్టాక్‌లలో కేవలం ఏడు శాతం ఉన్నాయి. 

ఆధారపడిన వారు.. 
జీవిత భాగస్వామిపై ఆధారపడిన మహిళల పెట్టుబడి ప్రవర్తన కూడా గణనీయంగా మారుతుంది. దాదాపు 43 శాతం మంది వివాహితలు 10 నుంచి 29 శాతం పెట్టుబడులకు కేటాయిస్తున్నారు. ఆదాయాన్ని ΄÷ందే మహిళలు తమ ఆదాయంలో సగానికి పైగా పెట్టుబడులుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 

క్రెడిట్‌ కార్డ్‌  వినియోగం
మెట్రో పాలిటన్‌ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాలలో మహిళలు క్రెడిట్‌ కార్డ్‌ వినియోగంలో ముందంజలో ఉన్నారు. సగం మంది మహిళలు తాము ఎప్పుడూ రుణం తీసుకోలేదని తెలియజేశారు. రుణం తీసుకున్నవారిలో గణనీయంగా గృహరుణం తీసుకోవడాన్ని ఎంచుకున్నారు. 

నగదును మించి యుపిఐ
షాపింగ్‌ చేయడంలో నగదు బదిలీ కన్నా యుపిఐ మార్గాలన్నే ఎక్కువ ఎంచుకుంటున్నారు. 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో సుమారు 33 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం యూపీఐని ఉపయోగిస్తున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్‌ 38 శాతం, బిల్లుల్లు 34 శాతం, ఇ–కామర్స్‌ కొనుగోళ్లు 29 శాతం సహా వివిధ చెల్లింపు అవసరాల కోసం యూపీఐ పట్టణ మహిళలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది. ఢిల్లీలో కేవలం రెండు శాతం మంది మహిళలు మాత్రమే నగదు చెల్లింపులను ఎంచుకున్నారు. కోల్‌కతాలో 43 శాతం మహిళలు ఈ ఎంపికను ఎంచుకున్నారు.. అని మహిళల ఆర్థిక నిర్ణయాల నివేదికను మన ముందుంచింది డీబీఎస్‌–క్రిసిల్‌ సర్వే. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement