‘యస్‌’బీఐ..! | RBI releases YES Bank rescue plan | Sakshi
Sakshi News home page

‘యస్‌’బీఐ..!

Published Sat, Mar 7 2020 4:26 AM | Last Updated on Sat, Mar 7 2020 5:20 AM

RBI releases YES Bank rescue plan - Sakshi

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్‌ 2020 ముసాయిదాను ఆర్‌బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్‌ బ్యాంక్‌ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్‌ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.  

    మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఏప్రిల్‌ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికిగానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌  వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్‌బీఐ చర్యలు తీసుకుందని, ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని భరోసా నిచ్చారు.

ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
యస్‌ బ్యాంక్‌లో గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ను కూడా మార్చాలని ఆర్‌బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్‌ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్‌బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు.
‘ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్‌ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్‌ చేసేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్‌ బ్యాంక్‌ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వొడాఫోన్‌ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్‌ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు.  
  

ఆందోళనలో కస్టమర్లు.. 
విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలతో యస్‌ బ్యాంక్‌ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు.

నెట్‌ బ్యాంకింగ్‌ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌ హోరెత్తింది. కొందరు ట్విట్టర్‌ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్‌బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్‌ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్‌ బ్యాంక్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఫిర్యాదులు చే శారు.  
 

షేరు 85 శాతం క్రాష్‌..

యస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయడం, విత్‌ డ్రాయల్స్‌పై ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం యస్‌ బ్యాంక్‌ షేర్‌ కుప్పకూలింది. శుక్రవారం ఒకానొక దశలో 85 శాతం దిగజారి రూ.5.55ను తాకింది. చివరకు 55 శాతం నష్టంతో రూ.16.55 వద్ద ముగిసింది.

గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి యస్‌ బ్యాంక్‌ షేర్‌ రూ.47గా ఉంది. షేర్‌ ధర భారీగా నష్టపోవడంతో ఈ షేర్‌లో ఇన్వెస్ట్‌ చేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. ఎల్‌ఐసీ మార్క్‌–టు–మార్కెట్‌ నష్టాలు రూ.617కోట్ల మేర ఉండగా,  మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్క్‌–టు–మార్కెట్‌నష్టాలు కూడా ఇదే రేంజ్‌లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,162 కోట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.3,300 కోట్లు నష్టపోయారు. ఇక హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ నష్టాలు రూ.239 కోట్లుగా ఉన్నాయి.


త్వరలో పరిష్కారమవుతుంది: ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ కుమార్‌
‘యస్‌ బ్యాంక్‌ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ సమస్య కాదు. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది‘ అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు.  
 

సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్‌ బ్యాంక్‌ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్‌బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్‌బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్‌ చెప్పారు.  



డిజిటల్‌ పార్ట్‌నర్స్‌కు సెగ..
యస్‌ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్‌టñ క్‌ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్‌ బ్యాంక్‌ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్‌లపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఆంక్ష లు విధించింది. ఇక, యస్‌ బ్యాంక్‌ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. మరోవైపు, యస్‌ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్‌ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి.

పూరీ జగన్నాథునికీ కష్టాలు...
యస్‌ బ్యాంకులో పూరీ జగన్నా«థ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్‌ బ్యాంకులో జగన్నాథుడి నిధులను డిపాజిట్‌ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్‌ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్‌ ప్రియదర్శి పట్నాయక్‌ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌ జెనా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement