90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమంలో ఆర్‌బీఐకి ప్రధాని మోదీ పిలుపు
ముంబై: ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, విశ్వాసాన్ని పెంపొందించడంసహా వచ్చే దశాబ్ద కాలంలో దేశాభివృద్ధే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన ప్రాధాన్యత కావాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆర్‌బీఐ 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే దశాబ్దం ఎంత ముఖ్యమో, ఆర్‌బీఐ 2035 నాటికి 100 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్వావలంభన, అంతర్జాతీయంగా రూపాయికి మరింత ఆమోదయోగ్యత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రధానికి ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక జ్ఞాపికను అందజేశారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి మూలస్తంభంగా పనిచేసే స్థిరమైన, బలమైన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్‌బీఐ అపార అనుభవం, నైపుణ్యతలు అంతర్జాతీయ అనిశ్చితులను ఎదుర్కొనడంలో దోహదపడిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమంలో పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బెయిన్స్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరాడ్, పంకజ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment