న్యూఢిల్లీ: రుణాలపై నెలవారీ వాయిదాలపై (ఈఎంఐ) మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు .. వారంతట వారు కోరితేనే అమలు చేయాలని ప్రైవేట్ రంగ బ్యాంకులు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. ‘మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీరిచ్చిన రీపేమెంట్ సూచనల మేరకు చెల్లింపులు యథావిధిగా జరిగిపోతాయి. కానీ, మారటోరియం కావాలనుకుంటే తెలియజేయండి‘ అంటూ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వెబ్‌సైట్లో రుణగ్రహీతలను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. మరోవైపు మారటోరియం కావాలనుకునే వారు (ఆప్టింగ్ ఇన్) నిర్దిష్ట ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపించాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కస్టమర్లకు సూచించింది.
అటు రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ దీన్ని కాస్త భిన్నంగా అమలు చేస్తోంది. వేతన జీవులకు సాధారణంగానే ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను, ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్న ట్రేడర్లు, చిన్న స్థాయి రుణగ్రహీతలకు ఆప్ట్–అవుట్ ఆప్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. స్వయం సహాయక గ్రూపులు, ఆభరణాలపై రుణాలు .. అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాలు .. ఓవర్‌డ్రాఫ్ట్‌లు తీసుకున్నవారు, క్రెడిట్ కార్డుహోల్డర్లు మొదలైనవారు ఆప్ట్–అవుట్ కేటగిరీలోకి వస్తారు. వీరు ఒకవేళ చెల్లింపులు కొనసాగించదల్చుకున్న పక్షంలో బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. మిగతా టర్మ్ లోన్‌లు తీసుకున్న వారు ఆప్ట్–ఇన్ కేటగిరీలోకి వస్తారు. ఇక, యాక్సిస్ బ్యాంక్.. తామింకా స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తున్నామని, ఇది పూర్తయ్యాక కస్టమర్లకు తెలియజేస్తామని వెల్లడించింది.
డబ్బుంటే కట్టేయండి..
చేతిలో నగదు ఉన్న కస్టమర్లు వీలైనంత వరకూ ఈఎంఐల చెల్లింపులు కొనసాగించేందుకే ప్రాధాన్యమివ్వాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సూచించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలవ్యవధి పొడిగింపునకు సమస్య ఉండదని పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా మటుకు ఆప్ట్–అవుట్ ఆప్షన్‌నే అమలు చేస్తున్నాయి. చెల్లింపులు కొనసాగిస్తానని కస్టమర్లు ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప.. ఆటోమేటిక్‌గా మారటోరియం వర్తింపచేస్తున్నాయి. కరోనా సంబంధించిన లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయాలు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో రుణాల ఈఎంఐల చెల్లింపులపై కొంత వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కట్టాల్సిన ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసుకోవచ్చు.
ఐబీఏ వివరణ...
అటు బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కూడా మారటోరియం ప్రభావాల గురించి వివరించింది. ‘మీ ఆదాయాలు దెబ్బతిన్న పక్షంలో ఆర్‌బీఐ ప్యాకేజీతో ప్రయోజనం పొందవచ్చు. అయితే, ఆయా రుణాలపై వడ్డీ భారం ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు కట్టాల్సిన అవసరం లేకపోయినా.. అదనపు భారం పడుతుందని గుర్తుంచుకోవాలి‘ అని పేర్కొంది. అటు క్రెడిట్ కార్డు బాకీల గురించి కూడా వివరణ ఇచ్చింది. సాధారణంగా మినిమం అమౌంట్ కూడా కట్టకపోతే క్రెడిట్ బ్యూరోలకు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ సర్క్యులర్ కారణంగా మూడు నెలల పాటు వెసులుబాటు ఉంటుందని వివరించింది. కానీ బాకీలపై భారీగా వడ్డీ ఉంటుందని హెచ్చరించింది.
వడ్డీల వాయింపు...
ఆర్‌బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం స్కీము.. పైకి కనిపించినంత ప్రయోజనకరమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తాత్కాలికంగా చెల్లింపుల నుంచి ఉపశమనం లభించినా.. ఆ తర్వాత అంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుందని, మరింత భారం తప్పదని పేర్కొన్నారు. దీంతో కరోనా దెబ్బకు ఆదాయాలు కోల్పోయిన వారు .. మారటోరియం ఎంచుకుంటే మరింత కాలం రుణాల భారం మోయాల్సి రానుంది. మారటోరియం వ్యవధిలో మిగతా బాకీపై వడ్డీల వడ్డన కొనసాగుతుందని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తెలియజేసింది. సోదాహరణంగా వివరించింది. ఉదాహరణకు రూ. 30 లక్షల గృహ రుణం చెల్లించడానికి మరో 15 ఏళ్ల వ్యవధి ఉందనుకుందాం. మూడు నెలల మారటోరియం తీసుకుంటే.. నికరంగా అదనంగా మరో రూ. 2.34 లక్షలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది సుమారు 8 నెలల ఈఎంఐలకు సమానం. అలాగే, రూ. 6 లక్షల వాహనం రుణం రీపేమెంట్‌కు 54 నెలలు మిగిలి ఉందనుకుందాం. దీనిపై అదనంగా రూ.19,000 అదనపు వడ్డీ భారం పడుతుంది. ఇది అదనంగా 1.5 ఈఎంఐకు సమానం.
కావాలంటే.. మీరే చెప్పండి
Published Thu, Apr 2 2020 1:50 AM | Last Updated on Thu, Apr 2 2020 1:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment