రీషెడ్యూల్ 3 జిల్లాలకే! | Crop Loan Reschedule for three months in Telangana, RBL Letter | Sakshi
Sakshi News home page

రీషెడ్యూల్ 3 జిల్లాలకే!

Published Sat, Aug 9 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

Crop Loan Reschedule for three months in Telangana, RBL Letter

* రుణాలపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖ
* గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ రుణాలకే వర్తింపు
* అది కూడా వడ్డీతో కలిపి లక్ష వరకే.. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు వర్తించదు
* తొలి ఏడాది మారటోరియం, తర్వాతి రెండేళ్లలో చెల్లింపునకు గడువు
* సర్కారుకు మహా అయితే వెయ్యి కోట్ల వరకే వెసులుబాటు
 
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ఇప్పటివరకు నాన్చుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించుకుని వీలైనంత వెసులుబాటు పొందాలని భావించిన సర్కారుకు నిరాశే ఎదురైంది. కేవలం మూడు జిల్లాల్లోని మండలాలకే రీషెడ్యూల్‌ను వర్తింపజేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. పైగా అసలు, వడ్డీ కలిపి లక్ష వరకు రుణాలకే దీన్ని పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి లేఖ అందింది.

తొమ్మిది జిల్లాల్లో గత ఏడాది కరువు, తుపాను బారిన పడిన 415 మండలాల్లో రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆర్‌బీఐని కోరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీని సాఫీగా అమలు చేసేందుకు ఎక్కువ మొత్తం రుణాలను రీషెడ్యూల్ చేయించుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేసింది. దాదాపు నెలన్నర రోజులుగా ఈ అంశంపై ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మొదట 337 మండలాలు, తర్వాత మరో 78 ప్రభావిత మండలాల జాబితాను అధికారులు పంపించారు. అయితే రుణ మాఫీ వంటి పథకాలతో బ్యాంకులు దివాళా తీస్తాయని ముందు నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆర్‌బీఐ.. రీషెడ్యూల్‌పై గట్టిగానే కసరత్తు చేసింది.

కరువు, తుపాను ప్రభావం ఆయా మండలాల్లో పంట ఉత్పత్తులపై ఏ మేరకు ఉందో అధ్యయనం చేసింది. గత ఏడాది సాగు పరిస్థితిని, పంటల దిగుబడుల వివరాలను సేకరించి చివరకు మూడు జిల్లాలకే రీషెడ్యూల్‌ను పరిమితం చేసింది. మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కరువు మండలాల రైతుల రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి నిర్ణయించింది. అదికూడా 2013 ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని... అలాగే అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయల వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని ఆర్‌బీఐ కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ దీపాలీపంత్ జోషి తన లేఖలో స్పష్టం చేశారు.

బంగారం తాకట్టు రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులను ముందస్తుగా తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలు, దీర్ఘకాలికంగా చెల్లించని(క్లోజ్డ్ లోన్స్) వాటిని రీషెడ్యూల్ చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. మూడు జిల్లాల్లోని వాణిజ్యబ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకారబ్యాంకులు ఇచ్చిన రుణాలు రీ షెడ్యూలవుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా.. రిజర్వ్‌బ్యాంకు ప్రామాణిక నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రీషెడ్యూల్ అయిన రుణాలపై తొలి ఏడాది మారటోరియం విధిస్తామని, తర్వాతి రెండేళ్లలో వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల గడువు తర్వాత కూడా రుణం చెల్లించనిపక్షంలో బ్యాంకులు తమ రుణాన్ని రైతుల నుంచి వసూలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయని వివరించారు. ఒకవేళ ఈ మొత్తాన్ని రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలనుకుంటే.. రైతుల పేరిట పూర్తి నగదు రూపంలో బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుందని దీపాలీపంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు వ్యవసాయ పనుల్లో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రీషెడ్యూల్‌కు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రీషెడ్యూల్ అయిన  జిల్లాల్లో రైతులకు కొత్త రుణాలు అందుబాటులోకి వస్తాయని లేఖలో పేర్కొన్నారు.

రీషెడ్యూల్ అయ్యేది అంతంతే!
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రీషెడ్యూలయ్యే పంట రుణాలు రూ. వెయ్యి కోట్ల కు మించవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కనీసం 337 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని ఇప్పటివరకు అధికారులు విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆర్‌బీఐ తాజా లేఖతో హతాశులయ్యారు. నిజానికి ప్రతిపాదిత కరువు మండలాలన్నింటికీ కలిపి కనీసం ఐదారు వేల కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని భావించారు. కానీ ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధిస్తూ.. 50 శాతం కంటే తక్కువ దిగుబడి వచ్చిన మండలాలనే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలను తెరపైకి తేవడంతో పరిస్థితి తలకిందులైంది.

లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు ఖజానాపై దాదాపు రూ. 17,337 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇప్పుడు వెయ్యి కోట్ల రుణాలకే రీషెడ్యూల్ అమలు కానున్న నేపథ్యంలో మిగిలిన రూ. 16 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది ప్రభుత్వం ముందు న్న సవాలు. 3 జిల్లాల్లోనే రీ షెడ్యూల్ చేసి మిగి లిన జిల్లాల్లోని రైతులకు కొత్త రుణాలు రాకపోతే.. ఎదురయ్యే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇంతకాలం ఆర్‌బీఐ రీషెడ్యూల్ కోసం నిరీక్షిస్తున్న కారణంగా రుణమాఫీ అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు త్వరలోనే దీన్ని అమలు చేస్తామని గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement