120మండలాలకే రీ షెడ్యూల్ వర్తింపు
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) పరిమితంగానే అనుమతి ఇచ్చింది. 4 జిల్లాల పరిధిలోని 120 మండలాల రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకరించింది. ఇందుకు సైతం కొన్ని పరిమితులు విధించింది. ఏపీలో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తున్నట్టు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపాలీ పంత్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు.
రాష్ట్రంలో 653 మండలాలు ఉండగా కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐని కోరిన విషయం తెలిసిందే. దాంతో గత ఖరీఫ్‌లో ఆహార ఉత్పత్తుల వివరాలను అందించాలని ఆర్‌బీఐ రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక విభాగం విడుదల చేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ వాటిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబిచ్చింది.
ఆహార ఉత్పత్తులు 50 శాతంకన్నా తక్కువగా వచ్చిన పక్షంలోనే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బీఐ నిబంధనలు అనుమతిస్తాయంటూ, ఆ వివరాలతో కూడిన సమాచారాన్ని కూడా రాష్ట్రానికి పంపింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో.. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తూ లేఖ రాసింది.
పరిమిత రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ ఏమన్నదంటే...
* బంగారంపై తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
* పంటలను కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
* చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటల రుణాలకు, మూసేసిన పంట రుణాల ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
* ప్రామాణిక ప్రాతిపదిక మేరకు రీ షెడ్యూల్‌ను 4 జిల్లాలకు మాత్రమే పరిమితం.
* శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది.
* కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు.
* రీ షెడ్యూల్ మూడేళ్లకే పరిమితం. తొలి ఏడాది మారిటోరియం ప్రకటనకు, తర్వాత రెండేళ్లలో రీ షెడ్యూల్‌కు అనుమతి.
* మూడేళ్లలో రైతులు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు ఆ బకాయి మొత్తాలను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తాయి.
* గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న పంట రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు వడ్డీతో కలిపి ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణం రీ షెడ్యూల్ వర్తిస్తుంది. వడ్డీతో కలిపి రుణం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నగదు రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలి.
* ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇక్కట్లకు గురికాకూడదని, రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలనే సానుభూతితో రుణాల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నాం.