సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ప్రధాన రంగాలలో వృద్ధి రేటు పరుగులు తీస్తుండటం లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం, కార్యదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆర్ధిక మందగమనం, కోవిడ్ సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,20,298.54 కోట్ల మేర పెరిగింది.
రాష్ట్రంలో మూడేళ్లలో జీఎస్‌డీపీలో 19.19 శాతం వృద్ధి నమోదు కాగా ఏటా సగటున 6.39 శాతం వృద్ధి సాధించింది. దేశవ్యాప్తంగా 2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది. ప్రస్తుత ధరల కన్నా స్థిర ధరలు మాత్రమే వాస్తవ ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ఈ నేపథ్యంలో స్థిర ధరల ఆధారంగా 2019–20 నుంచి 2021–22 వరకు వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతూనే ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం, తయారీ రంగాలలో మూడేళ్లుగా భారీ వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మరోవైపు కోవిడ్ లాంటి సంక్షోభాలేవీ లేనప్పటికీ టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్లడం గమనార్హం. వ్యవసాయంలో మూడేళ్లలో 20.05 శాతం వృద్ధి చంద్రబాబు హయాంలో 2018–19లో స్ధిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,26,614.20 కోట్లు ఉండగా 2021–22లో రూ.7,46,912.74 కోట్లకు పెరిగింది.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19.19 శాతం వృద్ధి నమోదైంది. సగటు వార్షిక వృద్ధి రేటు 6.39 శాతం ఉంది. 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.76,591.24 కోట్ల మేర పెరిగి ఏకంగా 11.42 శాతం మేర వృద్ధి నమోదైంది.
కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైంది. 2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో వ్యవసాయ రంగంలో రూ.13,900.77 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 20.05 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగం వృద్ధి ఏటా సగటున 6.88 శాతంగా ఉంది.
పారిశ్రామిక పరుగులు..
కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వరుసగా మూడేళ్లు వృద్ధి నమోదైంది. మూడేళ్లలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి విలువ రూ.26,719.51 కోట్లు పెరిగి 17.58 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 5.85 శాతం మేర వృద్ధి నమోదైంది. సేవా రంగంలో మూడేళ్లలో రూ.49,068.81 కోట్లు పెరిగి 20.76 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 6.92 శాతం వృద్ధి ఉంది. తయారీ రంగంలో కూడా మూడేళ్లలో రూ.7,758.15 కోట్లు పెరిగి 10.85 శాతం మేర వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున 3.61 శాతం వృద్ధి నమోదైంది.
నాడు.. సాగు దయనీయం
కోవిడ్ లాంటి సంక్షోభం లేకున్నా టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలోకి వెళ్లిపోవడం గమనార్హం. 2017–18లో స్దిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.74,118.40 కోట్లు ఉండగా 2018–19లో రూ.69,303.17 కోట్లకు పడిపోయింది. అంటే వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.4,815.23 కోట్లు తగ్గి 6.49 శాతం క్షీణించింది.
ఏపీలోనే జీఎస్‌డీపీ ఎక్కువ
దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 11.42 శాతం ఉండగా కర్నాటక, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్థూల ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment