బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం డీఐసీజీసీ బిల్లు 2021ను ఆమోదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై ₹ 5 లక్షల వరకు బీమా పొందవచ్చు అని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించిన కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆమె అన్నారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు ఊరట కలుగుతుందని సీతారామన్ తెలిపారు. "సాధారణంగా, బీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ, కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment