పాస్‌బుక్‌ రుణాలు మాఫీ | CM Revanth Reddy clarified on the waiver of farmers crop loan | Sakshi
Sakshi News home page

పాస్‌బుక్‌ రుణాలు మాఫీ

Published Wed, Jul 17 2024 4:11 AM | Last Updated on Wed, Jul 17 2024 4:11 AM

కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీఎస్‌ శాంతికుమారి

కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీఎస్‌ శాంతికుమారి

భూమి పాస్‌బుక్కుపై అప్పు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు 

రేపు రూ. లక్షలోపు మాఫీ.. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ

రేషన్‌ కార్డులు లేని 6.36 లక్షల మందికి కూడా వర్తింపు 

కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్‌ స్పష్టీకరణ

ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి 

ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారు వరకు చేర్చే బాధ్యత మీదే 

మీరు బదిలీ అయితే ప్రజలు కన్నీళ్లు పెట్టుకునేలా పనిచేయాలి 

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలి 

మహిళలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలిప్పించాలి 

పోలీసులు రహదారులపై కనిపించాలి.. డ్రగ్స్, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలి  

రేషన్‌కార్డులకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దన్న ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పంట రుణాల మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. భూమి పాస్‌బుక్కుపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌ కార్డులు ఉంటే రైతు రుణ ఖాతాలు 70 లక్షలేనని చెప్పారు. రేషన్‌ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. 

ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకుని పని చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారం¿ోపన్యాసం చేశారు. 9 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ సమావేశానంతరం సీఎం మాట్లాడారు. 

ప్రభుత్వ నిధులు రుణమాఫీకే వాడాలి 
‘18వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దని సూచించాలి. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేస్తే కేంద్రం చర్యలు తీసుకుంది. ఇప్పుడు మేం కూడా అలాగే చేస్తాం. రుణమాఫీ జరిగే రైతులను 18వ తేదీ రైతు వేదికల వద్దకు తీసుకురావాలి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి  సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారి చొప్పున అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు.   

ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లు, ఎస్పీలే     
‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు .. కలెక్టర్లు, ఎస్పీలే. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు, సారథులు మీరే. ఐఏఎస్‌ల కెరీర్‌లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయడమే కీలకం. కలెక్టర్లుగా ఉన్నప్పుడే అన్ని అంశాలపై అవగాహన వస్తుంది. ప్రతి పథకం చివరి లబ్ధిదారు వరకు చేరవేసే బాధ్యత మీదే. ఇటీవల రాష్ట్రంలో కొందరు టీచర్లు బదిలీపై వెళుతున్నప్పుడు విద్యార్థులు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు చూశా. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితీరు ఉండాలి. 

ఇక్కడి భాషతో పాటు సంస్కృతిలో కూడా కలెక్టర్లు మమేకం కావాలి. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. కలెక్టర్లు ఏసీ గదులకే పరిమితమైతే పనిలో సంతృప్తి ఉండదు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌ లాగా సామాన్య ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా పనిచేయాలి. కలెక్టర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను పర్యవేక్షించే బాధ్యతలు తీసుకోవాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. 

10 మంది చేసిన పని 33 మంది చేయలేరా? 
గతంలో ఉమ్మడి జిల్లాలను 10 మంది కలెక్టర్లే అద్భుతంగా నడిపించారు. ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గింది. కానీ అధికారాలు, బాధ్యతల్లో తేడా లేదు. అప్పుడు 10 మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది చేయలేరా? పనితీరుతో సమర్థతను చాటుకోవాలి. ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదే. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత మీదే..’ అని రేవంత్‌ చెప్పారు.   

ధరణి దరఖాస్తు తిరస్కరిస్తే కారణం చెప్పాలి 
‘పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించండి. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను చెప్పాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ప్రస్తుతం ఈ సంఘాల్లో ఉన్న 64 లక్షల మంది సభ్యులను కోటి మందిని చేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి. 

ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలిప్పించే లక్ష్యంతో పనిచేయాలి. ఆర్టీసీ అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి. అవసరాన్ని బట్టి జియో ట్యాగింగ్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసి నిఘా ఉంచాలి..’ అని సీఎం సూచించారు.  

ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ 
‘రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలి. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు శిక్షణనిచ్చి సర్టిఫికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్‌కు సీరియల్‌ నంబర్‌ ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 

మీ ముద్ర ఉండాలి.. 
జిల్లాల్లో ఉన్న వనరులు, అక్కడి పరిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్‌ ఒక ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమానికి రూపకల్పన చేయాలి. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలి. గిరిజనులకు పండ్ల మొక్కలతో ఆదాయం వచ్చేలా చేయాలి. అటవీ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ఖాళీగా ఉన్న భూమిని డ్రోన్ల ద్వారా సర్వే చేయించాలి. 

వికారాబాద్‌ అటవీ ప్రాంతంలో గతంలో మాదిరి ఔషధ మొక్కలు నాటాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల కోసం ప్రతి నియోజకవర్గంలో 20–25 ఎకరాల భూమి ఎంపిక చేయాలి. రహదారుల పక్కనే ఉండే గ్రామాలు, పట్టణాల్లో ఎవరు ముందు స్థలాలు ఎంపిక చేస్తే వారికే నిధులిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజీపడొద్దు 
‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు రాజీపడొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధితులతోనే కానీ నేరస్తులతో కాదు. పబ్బుల విషయంలో టైమింగ్‌ పెట్టండి. స్ట్రీట్‌ఫుడ్‌ వ్యాపారులను ఇబ్బంది పెట్టకండి. ఐటీ రంగ ఉద్యోగులు రాత్రివేళల్లో పనిచేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పోలీసులు రహదారులపై కనిపించాలి. 

క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి. డ్రగ్స్, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపండి. డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతున్న విదేశీయులపై దృష్టి సారించండి. కొల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో అవసరమైతే ప్రత్యేక బృందం వేయాలి..’ అని సీఎం ఆదేశించారు. 

పథకాలు కిందివరకు వెళ్లడం లేదు: డిప్యూటీ సీఎం 
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజలు,  ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని అన్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదన్నారు. ఇటీవల రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఇది తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. 
 
‘కల్తీ’పై కఠినంగా వ్యవహరించాలి: వ్యవసాయ మంత్రి 
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. 

సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement