న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్‌వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకూ మారటోరియం...
రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్‌బీఎఫ్‌సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి.
డిజిటల్ చెల్లింపులపై ప్రచారం...
కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్‌బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్‌బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్‌బీఐ తెలిపింది.
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
Published Fri, Apr 10 2020 5:32 AM | Last Updated on Fri, Apr 10 2020 5:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment