చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట! | COVID-19: Nirmala Sitharaman to announce details of economic package | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!

Published Thu, May 14 2020 1:10 AM | Last Updated on Thu, May 14 2020 11:50 AM

COVID-19: Nirmala Sitharaman to announce details of economic package - Sakshi

నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను  రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం వెల్లడించారు.

చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్‌లైన్‌ పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి.   కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్‌డౌన్‌ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్‌డౌన్‌ దెబ్బతో ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్‌ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.

ఎంఎస్‌ఎంఈలకు వరాలు
చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్‌ఎంఈల కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది.

వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్‌ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది.  ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు.

భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్‌ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్‌ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్‌ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్‌సీ,  ఆర్‌ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీలకు తీరనున్న నిధుల కష్టాలు..
తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్‌ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్‌ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది.

పీఎఫ్‌ భారం తగ్గింది..

100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్‌ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక,  బేసిక్‌ వేతనంలో  తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపిరి..
కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు.

రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్‌ మెజూర్‌ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం..  మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్‌ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు.

పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు
వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌), టీసీఎస్‌ (ట్యాక్స్‌ కలెక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్‌ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.


పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు  
ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్‌మెంట్స్‌ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్‌ 31, నవంబర్‌ 30 దాకాను, ట్యాక్స్‌ ఆడిట్‌ తుది గడువును సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 31 దాకా పొడిగించారు. ‘వివాద్‌ సే విశ్వాస్‌‘ స్కీమును డిసెంబర్‌ దాకా పొడిగించారు. వివద్‌ సే విశ్వాస్‌ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది.

రిఫండ్స్‌ సత్వరమే  
దాతృత్వ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, నాన్‌ కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్‌షిప్‌ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలకు మేలు...
ఆర్థిక మంత్రి సీతారామన్‌ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి.

– ప్రధాని నరేంద్రమోదీ

వృద్ధికి ఊతమిస్తుంది...
స్వయం సమృద్ధమైన భారత్‌ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్‌ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి

– నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి

డెవలపర్లకు బూస్ట్‌...
రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు.

– జక్సయ్‌ షా, క్రెడాయ్‌ చైర్మన్‌

చిన్న సంస్థలకు తక్షణ శక్తి...
ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్‌ఎంఈలకు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి.  

– దీపక్‌సూద్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌

కరోనాను ఎదుర్కొనే వ్యూహం...
నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్‌నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్‌ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది.

– సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

దీర్ఘకాల ప్రభావం ఉంటుంది...
చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్‌ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ 2006 నుంచి ఇది మారలేదు.

– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్‌ జనరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement