రూ. 20,00,000 కోట్లు.. అక్షరాలా ఇరవై లక్షల కోట్లు. కరోనా వైరస్ దెబ్బతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ ఇది. మన దేశ బడ్జెట్‌తో పోలిస్తే (సుమారు రూ. 30.42 లక్షల కోట్లు) దాదాపు 66 శాతం. ఇక జీడీపీలోనైతే దాదాపు 10 శాతం!!.
అంకెలైతే అదిరిపోయాయి. ఇంకేముంది... ఆర్థిక వ్యవస్థ రయ్యిమని దూసుకెళ్ళిపోతుందన్నారు. మన సర్కారుకెవ్వరూ సరిలేరంటూ వీరతాళ్లు వేసేశారు. కానీ ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్లూ దేనికోసమో చెప్పటానికి ఆర్థిక మంత్రి ఓ డైలీ సీరియల్‌ను ఆరంభించారు. ఐదు రోజులు కొనసాగించారు. చిత్రమేంటంటే జనానికి న్యాయబద్ధంగా రావాల్సిన పన్ను రీఫండ్లు... బ్యాంకులిచ్చే రుణాలు... దేశంలోకి వస్తాయని ఆశపడే పెట్టుబడులు... ఇలాంటివన్నీ కూడా ప్యాకేజీలోకొచ్చేశాయి. అసలు ప్యాకేజీ అంటే ఇప్పటికిప్పుడు రాష్ట్రాలను, జనాన్ని ఆదుకోవటానికి సర్కారు చేసే సాయం కదా? ఇలాంటివన్నీ ప్యాకేజీ ఎందుకవుతాయి? వీరతాళ్లు వేసినవారికి కూడా ఇలాంటి అనుమానాలొచ్చాయి? మీ అనుమానాలన్నీ నిజమేనంటూ స్టాక్‌మార్కెట్ ధబాలున కుప్పకూలి చూపించింది.
అంతేకాదు!! అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ప్యాకేజీని ఆడేసుకున్నాయి. ఆర్థిక మంత్రి మాటలన్నీ ఆ 20లక్షల కోట్లను చూపించటానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్యాకేజీ డొల్లేనంటూ విమర్శించాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే పచ్చి మోసం... దగా అంటూ దుయ్యబట్టారు. పడిపోయిన డిమాండ్‌కు ఊతమిచ్చే ప్రత్యక్ష ఉద్దీపన చర్యలేమీ లేకుండా... చిన్న సంస్థలకు రుణాలంటూ హడావిడి చేస్తే లాభమేంటని పరిశ్రమ తప్పుబట్టింది.
ఇది రుణ మేళా తప్ప ప్యాకేజీ కాదని విపక్షాలు తూర్పారబట్టాయి. కుదేలైన ఆతిథ్య, ఆటోమొబైల్ వంటి రంగాలు తమ ఊసే లేదంటూ మొత్తుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జోకులు వైరల్ అవుతున్నాయి. నిజానికి లాక్‌డౌన్ ఆరంభం నుంచి ప్రధాని మోదీని కీర్తించిన వారూ... ఈ ప్యాకేజీ చూశాక పెదవి విరవక తప్పటం లేదు.
ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాల ప్రకారం... నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ప్యాకేజీ కోసం ఖర్చు చేసేది రూ.3 లక్షల కోట్లు కూడా ఉండదు. ఇక బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేది రూ, లక్ష కోట్లను మించదు.
పాత స్కీముల రీసైక్లింగ్..
► రూ. 1 లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు ప్రతిపాదన. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మోదీ ప్రభుత్వం దాదాపు ప్రతీ బడ్జెట్లోనూ దీన్ని ప్రతిపాదిస్తూనే వచ్చింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్‌ఫ్రా (ఏఎంఐ) 2018లో సబ్ స్కీముగా ప్రవేశపెట్టింది. నాబార్డు దీనికి నిధులు సమకూరుస్తోంది. పాత స్కీముకే కొనసాగింపే ఈ కొత్త ఫండు.
► చిన్న, సన్నకారు రైతాంగానికి నాబార్డ్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్!. సహకార, ప్రాంతీయ బ్యాంకుల ద్వారా నాబార్డ్ రూ.30,000 కోట్లు సమకూర్చనుంది. ఇది రుణాలిచ్చే మరో పథకమే తప్ప ప్రభుత్వం నేరుగా నిధులిచ్చేదేమీ లేదు.
► లఘు ఆహార సంస్థలను సంఘటిత రంగంలోకి తెచ్చేందుకు రూ.10,000 కోట్ల స్కీము. నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఇప్పటికే రూ. 2,000 కోట్ల ఫండ్ ఉంది. దీని పరిమితి పెరగవచ్చు.
►రూ. 20,000 కోట్లతో మత్స్యకారులకు ప్యాకేజీ. వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఇప్పటికే మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా నీలి విప్లవం పేరిట ప్రభుత్వం ప్రత్యేక స్కీము నిర్వహిస్తోంది. 2019–20లో రూ.560 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 570 కోట్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి తాజా ప్యాకేజీలో ప్రస్తావించిన అంశాలన్నీ బ్లూ రెవల్యూషన్ వెబ్‌సైటులో ఉన్నవే!!.
► ముద్రా రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న వారికి 12 నెలల పాటు 2 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్యాకేజీలో ప్రకటించారు. సాధారణంగా బలహీన వర్గాలే ఎక్కువగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. వడ్డీ తగ్గింపు కాకుండా ఏ మారటోరియమో ఇచ్చి ఉంటే ఆర్థిక ప్యాకేజీ అయి ఉండేది.
► తోపుడు బళ్ల వర్తకుల్లాంటి స్ట్రీట్ వెండార్లకు రూ.5,000 కోట్ల రుణ సదుపాయం. దీని కింద రూ.10,000 దాకా రుణాలిస్తారు. నిజానికి ఈ రుణాలిచ్చేది బ్యాంకులే. మరి ఇది ప్రభుత్వ ప్యాకేజీ ఎలా..?
► ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణ ఆధారిత సబ్సిడీ స్కీము పొడిగింపు ద్వారా హౌసింగ్ రంగానికి రూ.70,000 కోట్ల ఊతం. ఇది కూడా ఇప్పటికే ఉన్న పథకానికి కొనసాగింపే. 2017–2020 మధ్య కాలంలో 3.3 లక్షల ఇళ్లు బుక్ కాగా.. ఈ పథకం వల్ల కొనుగోలుదారులు రూ.75,000 కోట్లు లబ్ధి పొందారు. మరి మిగతా 10 నెలల్లో దాదాపు 2.5 లక్షల ఇళ్లు బుక్ అయితేనే కొనుగోలుదార్లకు రూ. 70,000 కోట్ల లబ్ధి కలుగుతుంది. ఉద్యోగాలే ఊడుతున్న ఈ తరుణంలో ఇది సాధ్యమేనా?
► ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు. ఇది కొత్తదేమీ కాదు. కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. దీని డెడ్‌లైన్‌ను మార్చి 2021కి పొడిగించారు.
► బొగ్గు తవ్వకాల్లోకి ప్రైవేటు. గత అనుభవం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది.
► ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.4,000 కోట్లు. నిజానికి 2008–09 నుంచే నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇలాంటి పథకాన్ని అమలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment