న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. వ్యవసాయ, సాగు అనుబంధ రంగాలకు సంబంధించి రూ. 1.63 లక్షల కోట్లతో పలు కార్యక్రమాలను ఆమె ప్రకటించారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తామన్నారు.
జాతీయ విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహాయిస్తే.. వాటి ధరలు, నిల్వలపై నియంత్రణ ఉండబోదన్నారు. అలాగే, ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో ఉన్నవారికి, సరఫరా వ్యవస్థలో ఉన్నవారికి, ఎగుమతిదారులకు, కొన్ని నిబంధనలకు లోబడి, ఎలాంటి నిల్వ పరిమితి ఉండబోదన్నారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయకుండా, ధరలను కృత్రిమంగా పెంచకుండా నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) 1955లో అమల్లోకి తీసుకువచ్చారు.
ఇప్పుడు అనేక ఆహార ఉత్పత్తులు అవసరానికి మించి దిగుబడి అవుతున్న నేపథ్యంలో.. ఆ చట్టంలోని నిల్వ, ధరలకు సంబంధించిన నిబంధనల ఔచిత్యాన్ని కొంతకాలంగా అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీయే సర్కారు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలను కూడా ఆ చట్టం పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. అలాగే, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా.. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తూ ఒక చట్టాన్ని రూపొందిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లోనూ అమ్మేలా ఈ– ట్రేడింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.
అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్)’ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పంట చేతికి వచ్చిన తరువాత ఆ వ్యవసాయ ఉత్పత్తులను సమర్థంగా వినియోగించేందుకు ఉద్దేశించిన ఫామ్ గేట్, అగ్రిగేషన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ రంగంలోని ప్రాజెక్టులకు ఆ నిధి ద్వారా రుణాలందజేస్తామన్నారు.
నికరంగా అయ్యే ఖర్చు ఇంతే..
తొలి రెండు రోజుల్లో సుమారు రూ.9.1 లక్షల కోట్ల ప్యాకేజ్‌ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, అందులో నికరంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 16,500 కోట్లు మాత్రమేనని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వలస కూలీలకు చవక అద్దె ఇళ్లు, పలు పన్ను మినహాయింపులు, కంపెనీలు, ఉద్యోగులకిచ్చిన కొన్ని రాయితీలను కలుపుకుంటే అంతే అవుతుందని వివరించారు. అలాగే, శుక్రవారం ప్రకటించిన వాటిలోనూ ప్రభుత్వం అందించే నికర మొత్తం రూ. 1000 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.
నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు..
► ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లలో లైసెన్స్ ఉన్నవారికే రైతులు తమ ఉత్పత్తులను అమ్మాల్సి ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులకు ఇలాంటి నిబంధనేదీ లేదు. ఈ నిబంధన వల్ల రైతులకు సరైన ధర లభించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయనున్నాం. ఈ చట్టం ద్వారా.. తమ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మే విషయంలో రైతులకు పలు అవకాశాలు లభించేలా చూస్తాం. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తాం. ఈ – ట్రేడింగ్‌ను బలోపేతం చేస్తాం.
► వ్యవసాయ మౌలిక వసతులు, నిల్వ సౌకర్యాలు, సామర్థ్య పెంపుదలలను బలోపేతం చేయడం ఈ రూ. 1.63 లక్షల కోట్ల ప్రత్యేక వ్యవసాయ ప్యాకేజ్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు సూక్ష్మ వ్యవసాయాధారిత పరిశ్రమలు(మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్–ఎంఎఫ్‌ఈ), పశువులకు టీకాలు, పాల ఉత్పత్తి రంగం, ఔషధ మొక్కల పెంపకం, తేనెటీగల పెంపకం, పళ్లు, కూరగాయల సాగు.. తదితర రంగాలకు కూడా ఈ ప్యాకేజీలో సాయం అందించే ప్రతిపాదనలున్నాయి.
► ఔషధ, సేంద్రియ, బలవర్ధక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సుమారు రెండు లక్షల ఎంఎఫ్‌ఈలకు ఆర్థికంగా సాయమందించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం.
► రూ. 20 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ను ప్రారంభిస్తున్నాం. సముద్ర, నదీ మత్స్య సంపద అభివృద్ధికి, ఆ రంగంలో సుమారు 55 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది.
► పశు సంపద సంరక్షణకు రూ. 13,343 కోట్లను కేటాయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నివారణకు 100% టీకా కార్యక్రమం చేపడతాం.
► రూ. 15 వేల కోట్లతో ఎనిమల్ హస్బండరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా డైరీ ప్రాసెసింగ్, పశుదాణా నిర్వహణల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాం.
► 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కలను సాగును ప్రోత్సహించేందుకు రూ. 4 వేల కోట్లను, తేనెటీగల పెంపకం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం.
► టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకే కాకుండా అన్ని పళ్లు, కూరగాయలకు ‘ఆపరేషన్ గ్రీన్స్’ను విస్తరించాం. ఇందుకు రూ. 500 కోట్లను అదనంగా కేటాయించాం. ఈ మొత్తాన్ని దిగుబడి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆయా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులో రాయితీ కల్పించేందుకు, అలాగే, కోల్డ్ స్టోరేజ్‌లు సహా ఇతర స్టోరేజ్‌ల్లో నిల్వ ఖర్చులో రాయితీకి ఉపయోగించవచ్చు.
రైతు ఆదాయం పెరుగుతుంది: మోదీ
ఆర్థికమంత్రి ప్రకటించిన పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, రైతుల ఆదాయ పెంపునకు ఉపకరిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన అంశాలను నేను స్వాగతిస్తున్నా. ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మన రైతులకు, మత్స్యకారులకు, పాడి, పశు సంవర్థక రంగానికి సహాయకారిగా నిలుస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఉపకరించే సంస్కరణలను స్వాగతిస్తున్నానన్నారు.
ఆర్థిక మంత్రి ప్రకటించిన అంశాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ ప్రశంసించింది. నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేయాలన్న ప్రతిపాదన సహా వ్యవసాయ సంస్కరణలన్నీ భవిష్యత్తులో గొప్ప ప్రభావం చూపుతాయని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం పేర్కొన్నారు. సరైన ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే హక్కు లభించిన ఈ రోజు రైతులకు విమోచన దినోత్సవమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు.
రైతులను వంచిస్తున్నారు: కాంగ్రెస్
రైతుల పట్ల కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కోవిడ్–19 ఆర్థిక ప్యాకేజ్‌లో వారిని నిర్లక్ష్యం చేసినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల రైతులకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కేంద్రం అర్థంలేని ఆర్థిక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఈ రబీలో రైతులు రూ. 50 వేల కోట్లు నష్టపోయారని, ప్యాకేజీతో రైతులు, రైతు కూలీల జేబుల్లోకి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఈ ప్యాకేజీలో 13 జీరోలు మాత్రం ఉన్నాయని స్పష్టమైందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment