Essential Commodities Act
-
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీఏ) కింద నిత్యావసరాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాల జప్తు వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈసీ చట్టం కింద అక్రమ రవాణా వాహనాలను జప్తు చేసే అధికారం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కన్నా తక్కువ స్థాయి అధికారులకు లేదంటూ తాము పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ వాహనాల జప్తు అధికారం ఎస్‌ఐకన్నా తక్కువ స్థాయి అధికారులకు లేదంటూ అన్ని జిల్లాల యూనిట్లకు, పోలీస్ కమిషనర్లకు డీజీపీ స్వయంగా జారీచేసిన సర్క్యులర్ అమలుకు నోచుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. స్థాయి లేని అధికారులు తమ వాహనాలు జప్తు చేస్తూనే ఉన్నారన్న ఫిర్యాదులతో పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయని తెలిపింది. సంబంధిత అధికారి జప్తు చేస్తేనే ఆ వాహనాలపై కేసులు చెల్లుబాటు అవుతాయని, లేని పక్షంలో చెల్లవని స్పష్టం చేసింది. ఆ కేసులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పింది. కిందిస్థాయి పోలీసు అధికారుల అవిధేయత, అరాచక శైలిపై స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ తమ వాహనాలను పోలీసులు జప్తు చేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మారుతీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్, మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. -
కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విలయతాండవం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభాన్ని నివారించి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) బుధవారం సవరిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడం వల్ల దేశ వృద్ధికి కీలకమైన వ్యవసాయరంగం మరింత పుంజుకుంటుందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈ చట్టాన్న ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అమలు చేశారని.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా 50 ఏళ్ల రైతుల డిమాండ్ నెరవేరిందని జవదేకర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరోవైపు కోల్కత్తా పోర్ట్ ట్రస్ట్‌ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా పేరు మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. చదవండి: అనుబంధ వ్యవ‘సాయా’నికి! -
అనుబంధ వ్యవ‘సాయా’నికి!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. వ్యవసాయ, సాగు అనుబంధ రంగాలకు సంబంధించి రూ. 1.63 లక్షల కోట్లతో పలు కార్యక్రమాలను ఆమె ప్రకటించారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తామన్నారు. జాతీయ విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహాయిస్తే.. వాటి ధరలు, నిల్వలపై నియంత్రణ ఉండబోదన్నారు. అలాగే, ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో ఉన్నవారికి, సరఫరా వ్యవస్థలో ఉన్నవారికి, ఎగుమతిదారులకు, కొన్ని నిబంధనలకు లోబడి, ఎలాంటి నిల్వ పరిమితి ఉండబోదన్నారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయకుండా, ధరలను కృత్రిమంగా పెంచకుండా నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) 1955లో అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అనేక ఆహార ఉత్పత్తులు అవసరానికి మించి దిగుబడి అవుతున్న నేపథ్యంలో.. ఆ చట్టంలోని నిల్వ, ధరలకు సంబంధించిన నిబంధనల ఔచిత్యాన్ని కొంతకాలంగా అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీయే సర్కారు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలను కూడా ఆ చట్టం పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. అలాగే, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా.. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తూ ఒక చట్టాన్ని రూపొందిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లోనూ అమ్మేలా ఈ– ట్రేడింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్)’ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పంట చేతికి వచ్చిన తరువాత ఆ వ్యవసాయ ఉత్పత్తులను సమర్థంగా వినియోగించేందుకు ఉద్దేశించిన ఫామ్ గేట్, అగ్రిగేషన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ రంగంలోని ప్రాజెక్టులకు ఆ నిధి ద్వారా రుణాలందజేస్తామన్నారు. నికరంగా అయ్యే ఖర్చు ఇంతే.. తొలి రెండు రోజుల్లో సుమారు రూ.9.1 లక్షల కోట్ల ప్యాకేజ్‌ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, అందులో నికరంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 16,500 కోట్లు మాత్రమేనని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వలస కూలీలకు చవక అద్దె ఇళ్లు, పలు పన్ను మినహాయింపులు, కంపెనీలు, ఉద్యోగులకిచ్చిన కొన్ని రాయితీలను కలుపుకుంటే అంతే అవుతుందని వివరించారు. అలాగే, శుక్రవారం ప్రకటించిన వాటిలోనూ ప్రభుత్వం అందించే నికర మొత్తం రూ. 1000 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు.. ► ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లలో లైసెన్స్ ఉన్నవారికే రైతులు తమ ఉత్పత్తులను అమ్మాల్సి ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులకు ఇలాంటి నిబంధనేదీ లేదు. ఈ నిబంధన వల్ల రైతులకు సరైన ధర లభించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయనున్నాం. ఈ చట్టం ద్వారా.. తమ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మే విషయంలో రైతులకు పలు అవకాశాలు లభించేలా చూస్తాం. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తాం. ఈ – ట్రేడింగ్‌ను బలోపేతం చేస్తాం. ► వ్యవసాయ మౌలిక వసతులు, నిల్వ సౌకర్యాలు, సామర్థ్య పెంపుదలలను బలోపేతం చేయడం ఈ రూ. 1.63 లక్షల కోట్ల ప్రత్యేక వ్యవసాయ ప్యాకేజ్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు సూక్ష్మ వ్యవసాయాధారిత పరిశ్రమలు(మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్–ఎంఎఫ్ఈ), పశువులకు టీకాలు, పాల ఉత్పత్తి రంగం, ఔషధ మొక్కల పెంపకం, తేనెటీగల పెంపకం, పళ్లు, కూరగాయల సాగు.. తదితర రంగాలకు కూడా ఈ ప్యాకేజీలో సాయం అందించే ప్రతిపాదనలున్నాయి. ► ఔషధ, సేంద్రియ, బలవర్ధక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సుమారు రెండు లక్షల ఎంఎఫ్ఈలకు ఆర్థికంగా సాయమందించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ► రూ. 20 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ను ప్రారంభిస్తున్నాం. సముద్ర, నదీ మత్స్య సంపద అభివృద్ధికి, ఆ రంగంలో సుమారు 55 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది. ► పశు సంపద సంరక్షణకు రూ. 13,343 కోట్లను కేటాయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నివారణకు 100% టీకా కార్యక్రమం చేపడతాం. ► రూ. 15 వేల కోట్లతో ఎనిమల్ హస్బండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా డైరీ ప్రాసెసింగ్, పశుదాణా నిర్వహణల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాం. ► 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కలను సాగును ప్రోత్సహించేందుకు రూ. 4 వేల కోట్లను, తేనెటీగల పెంపకం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. ► టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకే కాకుండా అన్ని పళ్లు, కూరగాయలకు ‘ఆపరేషన్ గ్రీన్స్’ను విస్తరించాం. ఇందుకు రూ. 500 కోట్లను అదనంగా కేటాయించాం. ఈ మొత్తాన్ని దిగుబడి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆయా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులో రాయితీ కల్పించేందుకు, అలాగే, కోల్డ్ స్టోరేజ్‌లు సహా ఇతర స్టోరేజ్‌ల్లో నిల్వ ఖర్చులో రాయితీకి ఉపయోగించవచ్చు. రైతు ఆదాయం పెరుగుతుంది: మోదీ ఆర్థికమంత్రి ప్రకటించిన పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, రైతుల ఆదాయ పెంపునకు ఉపకరిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన అంశాలను నేను స్వాగతిస్తున్నా. ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మన రైతులకు, మత్స్యకారులకు, పాడి, పశు సంవర్థక రంగానికి సహాయకారిగా నిలుస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఉపకరించే సంస్కరణలను స్వాగతిస్తున్నానన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన అంశాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ ప్రశంసించింది. నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేయాలన్న ప్రతిపాదన సహా వ్యవసాయ సంస్కరణలన్నీ భవిష్యత్తులో గొప్ప ప్రభావం చూపుతాయని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం పేర్కొన్నారు. సరైన ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే హక్కు లభించిన ఈ రోజు రైతులకు విమోచన దినోత్సవమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. రైతులను వంచిస్తున్నారు: కాంగ్రెస్ రైతుల పట్ల కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కోవిడ్–19 ఆర్థిక ప్యాకేజ్‌లో వారిని నిర్లక్ష్యం చేసినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల రైతులకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కేంద్రం అర్థంలేని ఆర్థిక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఈ రబీలో రైతులు రూ. 50 వేల కోట్లు నష్టపోయారని, ప్యాకేజీతో రైతులు, రైతు కూలీల జేబుల్లోకి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఈ ప్యాకేజీలో 13 జీరోలు మాత్రం ఉన్నాయని స్పష్టమైందని ఎద్దేవా చేశారు. -
కందిపప్పు నిల్వలపై నిఘా పెట్టండి
♦ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ♦ పప్పుల నిల్వల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం ♦ బ్లాక్‌మార్కెట్ నిలువరించేలా చర్యలు చేపట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాల ధరలు భారీగా పెరిగిన దృష్ట్యా నిల్వలపై నిఘా పెంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆకస్మిక దాడులు, విసృ్తత తనిఖీలు నిర్వహించి బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకోవాలని సూచించింది. నిత్యావసర సరుకుల చట్టంలో ఇటీవల చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్రాలు వ్యవహరించాలని పేర్కొంది. రాష్ట్రంలో మేలురకం కందిపప్పు ధర కిలో రూ.200కు చేరుకోగా, మినపపప్పు సైతం రూ.190 వరకు పలుకుతోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర సరుకుల చట్టంలో కేంద్రం మార్పులు చేసింది. లెసైన్స్ పొందిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులతో పాటు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల సంస్థలు నిల్వ చేసుకొనే పప్పు ధాన్యాలపై పరిమితులు విధించింది. దీనికి సంబంధించి సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పప్పుధాన్యాల లభ్యత, ధరలు, నిల్వలు, నిఘా తదితర అంశాలను తెలుసుకున్నారు. నిల్వలపై విధించిన పరిమితిని ధిక్కరించేవారిపై, కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించని వ్యాపారులపై నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రాలు పప్పుధాన్యాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని... ఖరీఫ్‌లో వచ్చే పంటను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ‘కంది’ విక్రయ కేంద్రాలపై మిల్లర్లు విముఖం పెరిగిన ధరల దృష్ట్యా ప్రత్యేకంగా కంది విక్రయ కేంద్రాలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల దాల్ మిల్లర్లు విముఖత చూపినట్లు తెలిసింది. అంతర్జాతీ య, జాతీయ డిమాండ్ దృష్ట్యా ధరలు హె చ్చుగా ఉన్నాయని.. ఈ దశలో తాము అధిక ధరకు కొనుగోలు చేసి కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన ధరలకు విక్రయించలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 కందిపప్పు విక్రయ కేంద్రాల్లో సైతం మిల్లర్లు అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిసింది. కందిపప్పు ధర కిలో రూ.200కు చేరడం.. ఈ కేంద్రాల్లో రూ.100కే విక్రయించాల్సి రావడంతో భారం పడుతోం దని.. దీనివల్లే వాటిని దాల్ మిల్లర్లు మూసివేశారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉల్లి ఎగుమతి ధర పెంపు
* నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి ఉల్లి, బంగాళాదుంప న్యూఢిల్లీ: నిత్యావసర ఆహారపదార్థాల ధరలు పెరుగుతుండటంపై ఆందోళనకు గురవుతున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని అదుపులో పెట్టేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 500 డాలర్లకు(రూ. 29,773) పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశీ మార్కెట్లో వీటి సరఫరా మెరుగవడంతో పాటు ధర కూడా తగ్గుతుందని భావిస్తోంది. కనీస ఎగుమతి ధర కన్నా తక్కువ ధరకు ఎవరూ ఎగుమతి చేయకూడదు. యూపీఏ ప్రభుత్వం మార్చి నెలలో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించగా.. నెలక్రితం వాటి ఎగుమతులకు అనుమతిస్తూ, ఎంఈపీని 300 డాలర్లుగా నిర్ణయించారు. మరోవైపు, ధరల తగ్గింపు లక్ష్యంగా బుధవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని.. * ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి చేర్చారు. తద్వారా వాటి లభ్యత పెరగడంతో పాటు, వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమవుతుంది. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడం సాధ్యమవుతుంది. చట్టప్రకారం ఎంత మొత్తాల్లో నిల్వ చేయొచ్చనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. 1999 -2004 మధ్య కూడా ఉల్లి, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోనే ఉన్నాయి. * ఆహార భద్రత చట్టం అమల్లో లేని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసేందుకు అదనంగా 50 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలి. రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోసం తీసుకునే చర్యలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 4న ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం కూడా హాజరుకానుంది. రాష్ర్ట ఆర్థిక, పౌరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి, ఇతర అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ర్టంలో కూడా బియ్యంతోపాటు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.