కందిపప్పు నిల్వలపై నిఘా పెట్టండి
♦ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
♦ పప్పుల నిల్వల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం
♦ బ్లాక్‌మార్కెట్ నిలువరించేలా చర్యలు చేపట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాల ధరలు భారీగా పెరిగిన దృష్ట్యా నిల్వలపై నిఘా పెంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆకస్మిక దాడులు, విసృ్తత తనిఖీలు నిర్వహించి బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకోవాలని సూచించింది. నిత్యావసర సరుకుల చట్టంలో ఇటీవల చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్రాలు వ్యవహరించాలని పేర్కొంది. రాష్ట్రంలో మేలురకం కందిపప్పు ధర కిలో రూ.200కు చేరుకోగా, మినపపప్పు సైతం రూ.190 వరకు పలుకుతోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర సరుకుల చట్టంలో కేంద్రం మార్పులు చేసింది.
లెసైన్స్ పొందిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులతో పాటు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల సంస్థలు నిల్వ చేసుకొనే పప్పు ధాన్యాలపై పరిమితులు విధించింది. దీనికి సంబంధించి సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పప్పుధాన్యాల లభ్యత, ధరలు, నిల్వలు, నిఘా తదితర అంశాలను తెలుసుకున్నారు. నిల్వలపై విధించిన పరిమితిని ధిక్కరించేవారిపై, కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించని వ్యాపారులపై నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రాలు పప్పుధాన్యాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని... ఖరీఫ్‌లో వచ్చే పంటను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
‘కంది’ విక్రయ కేంద్రాలపై మిల్లర్లు విముఖం
పెరిగిన ధరల దృష్ట్యా ప్రత్యేకంగా కంది విక్రయ కేంద్రాలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల దాల్ మిల్లర్లు విముఖత చూపినట్లు తెలిసింది. అంతర్జాతీ య, జాతీయ డిమాండ్ దృష్ట్యా ధరలు హె చ్చుగా ఉన్నాయని.. ఈ దశలో తాము అధిక ధరకు కొనుగోలు చేసి కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన ధరలకు విక్రయించలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 కందిపప్పు విక్రయ కేంద్రాల్లో సైతం మిల్లర్లు అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిసింది. కందిపప్పు ధర కిలో రూ.200కు చేరడం.. ఈ కేంద్రాల్లో రూ.100కే విక్రయించాల్సి రావడంతో భారం పడుతోం దని.. దీనివల్లే వాటిని దాల్ మిల్లర్లు మూసివేశారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.