రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాల ధరలకు రెక్కలు
భారీగా పెరిగిన కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు
అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి, పెరిగిన ధరలు
వాపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలు
పుణే మార్కెట్లో కిలో మునక్కాయలు రూ. 400-500
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు.
కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే...
ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి.
రాష్ట్రంలోని హోల్‌సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.
వంటనూనెలదీ ఇదే దారి...
కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment