అగ్రరాజ్యం అతలాకుతలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా కాటుకి తల్లడిల్లిపోతోంది. కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి అతి పెద్ద దేశాన్ని పెనుభూతంలా భయపెడుతోంది. ఒకే రోజులో 16 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య దాదాపుగా 86వేలకు చేరుకుంది. చైనా (81,782), ఇటలీ (80,589)ని మించిపోయేలా కేసులు నమోదు కావడంతో ప్రపంచ పెద్దన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఒక వారంలో కేసుల సంఖ్య పది రెట్లు పెరిగి ఉప్పెనలా ముంచెత్తడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే మరణాల సంఖ్యలో చైనా, ఇటలీ కంటే తక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికి 1300 మందికిపైగా ఈ వైరస్తో మరణిస్తే చైనాలో 3,300 మంది, ఇటలీలో 8,250 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
చైనా గణాంకాలు తప్పుడు తడకలేనా
కరోనా కేసుల్లో అమెరికా చైనాని మించి పోవడంతో ఆ దేశం వెల్లడిస్తున్న అధికారిక లెక్కలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా చైనాలో ఎంత మందికి సోకింది? ఎందరు మరణించారు? అన్న వివరాలు తెలీవన్నారు. తమ దేశంలో టెస్టింగ్ కిట్లు అన్ని రాష్ట్రాల్లో లభిస్తుండడం వల్ల కేసుల సంఖ్య సరిగ్గా తెలుస్తోందన్నారు. వైట్హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బ్రిక్స్ మొత్తం కేసుల్లో 55శాతం న్యూయార్క్లో నమోదు కావడం ఆందోళన రేపే అంశమన్నారు. 19 రాష్ట్రాల్లో 200 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు.
న్యూయార్క్ ఆస్పత్రులు కిటకిట
దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం న్యూయార్క్ సిటీలో నమోదు కావడంతో అక్కడ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పడకలతో కూడిన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్న వారే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు 50, 40 ఏళ్ల వయసులో ఉన్న వారు మరణించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని స్థానిక ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఒకరు చెప్పారు. ప్రజలు ఎవరూ రక్షణ చర్యలు చేపట్టడం లేదని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.