1000 శాతానికి పెరిగిన ఆ లావాదేవీలు!
Published Fri, Dec 9 2016 8:04 PM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం డిజిటల్ లావాదేవీలు ఏకంగా 400-1000శాతం రేంజ్లో పెరిగాయని న్యాయ, ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ లావాదేవీల్లో మాస్టర్, వీసా కార్డుల లావాదేవీలను కలుపలేదని, కార్డుల వాడకం కలుపకుండానే డిజిటల్ లావాదేవీల్లో ఈ మేరకు నమోదుకావడం విశేషమని పేర్కొన్నారు. ఓ టీవీ చానల్, వెబ్సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను తెలిపారు. ఫ్రీ-టూ-ఎయిర్ చానల్ డిగిశాలను మంత్రి ప్రారంభించారు. ఈ చానల్ దూరదర్శన్ డీటీహెచ్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. క్యాష్ లెస్ ఇండియా వెబ్సైట్ కూడా ఆయన లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించున్నారు.
దూరదర్శన్ ప్లాట్ఫామ్ ను మొత్తం 2 కోట్లకు పైగా ప్రజలు వాడుతున్నారు. వారిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు. ప్రజలు ఎడ్యుకేట్ అయితే ఈ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతాయో మనం అర్థంచేసుకోగలమని ప్రసాద్ వారికి చెప్పారు. ఈ-వాలెట్ల లావాదేవీలు రోజుకు 17 లక్షల నుంచి 63 లక్షలకు పెరిగినట్టు పేర్కొన్నారు. వీటి విలువ కూడా రూ.52 కోట్ల నుంచి రూ.191 కోట్లకు ఎగిసినట్టు వెల్లడించారు. రూపే కార్డు ద్వారా లావాదేవీలు రోజుకు రూ.16 లక్షలు, యూపీఏ లావాదేవీలు రోజుకు 48వేలకు పెరిగినట్టు తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల, పన్నుఎగవేత తప్పి, దేశ ఆర్థికవ్యవస్థ మెరుగవుతుందన్నారు. బ్యాంకులోకి వచ్చిన నగదును ప్రజల సంక్షేమం కోసం వాడతామని హామీ ఇచ్చారు.
Advertisement