సాక్షి, చెన్నై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు పెద్దనోట్ల రద్దును చేపట్టామని పాలకులు ఘనంగా చెప్తున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటికీ నగదురహిత లావాదేవీలు నత్తనడకనే సాగుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నగదురహిత లావాదేవీల్లో కీలకమైన వ్యాలెట్లు, నాన్ యూపీఐ బ్యాంకింగ్ యాప్‌లు, ఆధార్ సహిత చెల్లింపులు అనుకున్నంతగా ఊపందుకోలేదు. మరోవైపు డెబిట్‌కార్డు లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.
ఇక పెద్దనోట్ల రద్దు తర్వాత.. యూపీఐ చెల్లింపులు పెరుగుతుండటం సానుకూల అంశం. యూపీఐ చెల్లింపుల్లో మొబైల్ ఫోన్ల ఆధారంగా జరుగుతున్న లావాదేవీలే అధికం. మొత్తంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ. 200 ట్రిలియన్లకు చేరాయి. 2016 ఆగస్టుతో పోలిస్తే 5 శాతం పెరుగుదల నమోదైంది. అయితే, పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న గత డిసెంబర్ (రూ. 201 ట్రిలియన్లు)తో పోలిస్తే 0.7శాతం డిజిటల్ చెల్లింపులు తగ్గడం గమనార్హం.
కొన్ని క్యాటగిరీల్లో డిజిటల్ చెల్లింపులు పెద్దనోట్ల రద్దు ముందు కన్నా తక్కువస్థాయికి పడిపోవడం గమనార్హం. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే 30శాతానికి పడిపోయింది. పెద్దనోట్ల రద్దు తీవ్రంగా ఉన్న కాలంతో పోల్చుకుంటే 46శాతానికి ఇది పడిపోయింది. ఇక డెబిట్ కార్డు చెల్లింపులు కూడా తగ్గిపోయాయి. గత ఏడాది అక్టోబర్‌లో డెబిట్ కార్డు చెల్లింపులు రూ. 2,767 బిలియన్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 2.2శాతం తగ్గి.. రూ. 2,706 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే, డెబిట్ కార్డు ట్రాన్‌సాక్షన్స్ (లావాదేవీలు) మాత్రం నాలుగు శాతం పెరిగాయి.
ఇక, పెద్దనోట్ల రద్దు వల్ల మొబైల్ బ్యాంకింగ్, వ్యాలెట్ సేవలు పెరగడం ప్రధాన లబ్ధి చెప్తున్నా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం ఆన్‌లైన్ చెల్లింపుల్లో మొబైల్ బ్యాంకింగ్ వాటా 0.33శాతమే (రూ. 799.13 బిలియన్లు) కావడం గమనార్హం. పేటీఎం, మొబిక్విక్, బ్యాంకింగ్ వ్యాలెట్లు ఇలా.. మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరుగుతున్న చెల్లింపులు కూడా స్వల్పంగానే ఉన్నాయి. మొత్తం ఆన్‌లైన్ చెల్లింపుల్లో మొబైల్ వ్యాలెట్ల వాటా కేవలం 0.051శాతమే (రూ. 102.88 బిలియన్లు)...
ఇప్పటికీ కింగ్ క్యాషే..!
మొత్తానికి పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా నగదు లావాదేవీలు గణనీయంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రజలు ఇప్పటికీ నగదు కోసం ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఎటీఎంల నుంచి చిన్నచిన్న మొత్తాలను తీసుకొని తమ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా పదిశాతం తక్కువ నగదు ప్రస్తుతం చెలామణిలో ఉంది. అయినా, నగదు లావాదేవీలకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment