సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక.. నగదు రహిత లావాదేవీ వ్యవస్థను, సరిగ్గా బ్యాంకు సౌకర్యాలు కూడా లేని గ్రామాల్లో చొప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తన శక్తిమేర చాలా వరకు కృషి చేసింది. చిరు వ్యాపారస్థులు, గ్రామీణ ప్రజలను అయోమయానికి గురి చేసేలా డిజిటల్ విధానాన్ని తప్పనిసరి(అనివార్య పరిస్థితులు కల్పించి) చేసింది. అయితే నెల తిరక్కుండానే దేశంలోనే ప్లాస్టిక్ కరెన్సీ(కార్డు లావాదేవీలు)కి పెద్ద పీట వేస్తున్నాయంటూ ఆదర్శ గ్రామాలుగా ఐదింటిని ప్రకటించింది. సంస్కరణకు ఏడాది పూర్తి కావటంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయి.
ధాసై, థానే జిల్లా మహారాష్ట్ర... మొత్తం 60,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 98 దుకాణ సముదాయలు ఉన్నాయి. వీటిలో 70 షాపు ఓనర్లు కార్డుల ద్వారానే నగదును స్వీకరిస్తున్నారంటూ గతంలో నివేదిక ప్రకటించింది. అయితే అది వాస్తవం కాదని ఇప్పుడు వెలుగుచూసింది . చిన్నమొత్తంలో వ్యాపారం కొనసాగటం.. అన్నింటికి మించి సరైన విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో వారంతా తిరిగి మళ్లీ నోట్లతోనే క్రయవిక్రయాలు చేయటం మొదలుపెట్టారు.
అకోదరా, సమర్‌కాంత జిల్లా గుజరాత్... ఐసీఐసీ బ్యాంకు వారు దత్తత తీసుకున్న ఈ గ్రామం జనాభా 1200. వీరిలో చాలా మంది కోళ్ల పరిశ్రమ, వేరుశనగ పంట ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో వీరికి ఎక్కువగా నగదు అవసరమే పడుతోంది. అందుకే డిజిటల్ విధానం వైపు మొగ్గుచూపటం తగ్గిపోయిందని అకోదరా డెయిరీ సమితి కార్యదర్శి అల్ఫేశ్ పటేల్ చెబుతున్నారు.
బధ్ఝిరి, భోపాల్ జిల్లా మధ్య ప్రదేశ్... రాజధానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం దేశంలోనే తొలి ‘క్యాష్ లెస్ విలేజ్’గా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని దేశమంతా క్యాష్ లెస్ విధానంవైపు నడవాలని, డిజిటలైజేషన్ దిశగా మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపును కూడా ఇచ్చాయి. మరిప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉందో చూడండి... ఆ గ్రామంలో చాలా వరకు నిరక్షరాస్యులు ఉన్నారు. పైగా 1 నుంచి 2 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి.
ఝట్టిపూర్, పానిపట్ జిల్లా హరియాణా... అక్కడి ప్రభుత్వం ఈ గ్రామాన్ని 100 శాతం క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటించింది. అయితే అందుకు భిన్నంగా చాలా మంది అక్కడి ఇప్పటికీ నగదు లావాదేవీలనే జరుపుతూ కనిపించటం కొసమెరుపు.
పట్సా గ్రామం, పట్నా జిల్లా, బిహార్... మారుమూల పల్లె కావటంతో స్వైపింగ్ మెషీన్లు అంతగా ప్రాధాన్యం సంతరించుకోలేకపోయాయి.చాలా మంది మెషీన్లను వెనక్కి పంపించేయటంతో... డిజిటిల్ లావాదేవీల ప్రయత్నం ఇక్కడా బెడిసి కొట్టింది.
దీంతో కేంద్రప్రభుత్వం డిజిటలైజేషన్‌కు ఆదర్శ గ్రామాలుగా చెప్పుకుంటున్న చోటే అట్టర్ ఫ్లాప్ అయినట్లని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే గ్రామీణ పరిస్థితులు, నిరక్షరాస్యత, అవగాహన-సౌకర్యాల లేమి... తదితర కారణాల మూలంగా ఆయా గ్రామాల్లో క్యాష్‌లెస్ విధానం విఫలం అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment