ఆన్‌లైన్ వ్యయాల తగ్గింపుపై కసరత్తు
• మెరుగుపడిన నగదు లభ్యత
• డీమోనిటైజేషన్‌తో వృద్ధిపై స్వల్పకాలిక ప్రభావం
• దీర్ఘకాలంలో ఎకానమీకి ప్రయోజనకరమే
• పీఏసీకి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరణ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు దరిమిలా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీల వ్యయాలు తగ్గించే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వివరించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షపై మౌఖిక వివరణనిచ్చేందుకు శుక్రవారం పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ముందు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. కమిటీకి ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు తగ్గించే విధానం రూపకల్పనపై బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు మొదలైన వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు పీఏసీకి ఆర్‌బీఐ వివరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నగదు సరఫరా మెరుగుపడిందని.. కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సమస్యలు ఉన్నప్పటికీ.. రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితి చక్కబడగలదని పటేల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీమోనిటైజేషన్ ప్రభావం స్వల్పకాలికంగా వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం చూపినా.. మధ్య, దీర్ఘకాలికంగా ఎకానమీకి ప్రయోజనం చేకూర్చగలదని ఆయన వివరించారు.
మరిన్ని అంశాలు చర్చించేందుకు ఫిబ్రవరి 10న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు, అవసరమైతే పటేల్‌ను కూడా మరోసారి పిలిపించనున్నట్లు సమావేశం అనంతరం పీఏసీ చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో పలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు ఒక్కసారిగా ఎగియడం గురించి ప్రశ్నించిన కమిటీ.. ఈ అంశంపై దృష్టి సారించాలని ఆర్‌బీఐకి సూచించింది. నోట్ల రద్దు అంశంపై గతేడాది జనవరి నుంచి ప్రభుత్వంతో చర్చలు జరిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. గవర్నర్ పటేల్, ఇద్దరు డిప్యూటీ గవర్నర్స్ (ఆర్ గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా), అయిదుగురు ఆర్‌బీఐ డైరెక్టర్లు (నచికేత్ మోర్, భరత్ ఎన్ దోషి, సుధీర్ మన్కడ్, శక్తికాంత దాస్, అంజలీ చిబ్ దుగ్గల్) హాజరయ్యారు.