tax cut
-
విండ్ ఫాల్ టాక్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
విండ్‌ఫాల్ టాక్స్ కోత: వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు 2 రూపాయలు పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్‌ఫాల్ టాక్స్ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత పెట్రోలియం రంగానికి భారీ ఊరటనిస్తుందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది. -
అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా!
భారత్ టెస్లా కంపెనీల మధ్య డీల్ కొలిక్కి రావడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను భారత్‌లోకి దిగుమతి చేయడంతో పాటు సొంత షోరూంలతో వాహనాలను అమ్ముకోవాలన్న టెస్లా ఆశలపై కేంద్రం నీళ్లు జల్లుతూ వస్తోంది. ఈ తరుణంలో ఇరు వర్గాల చర్చల విషయంలో ప్రతిష్టంబన నెలకొన్నట్లు తాజా సమాచారం. టెస్లా-భారత ప్రభుత్వాల మధ్య ఏడాది కాలంగా సాగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ట్యాక్స్ మినహాయింపులు కోరుతూ తమ మార్గం సుగమం చేయాలని ఈ అమెరికా ఆటోమేకర్, భారత ప్రభుత్వాన్ని బతిమాలుతోంది. అందుకు భారత్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లోనే దిగుమతి సుంకం అధికంగా ఉందంటూ మొదటి నుంచి టెస్లా సీఈవో మస్క్ చెప్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి న్యూ ఢిల్లీ కేంద్రంగా పలు దఫాలుగా.. టెస్లా ప్రతినిధులు భారత అధికారులతో లాబీయింగ్ చేస్తున్నారు. టారిఫ్‌లు తగ్గించమని కోరుతున్నారు. కానీ, టెస్లా విజ్ఞప్తులకు భారత ప్రభుత్వం కరగడం లేదు. పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వనందున టెస్లాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని తేల్చేసి చెప్పింది. ఈ తరుణంలో.. చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు టెస్లాతో దగ్గరి సంబంధాలు ఉన్న ఓ ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం టెస్లాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాహనాలపై వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. ఈ ప్రకారం.. టెస్లా తన కార్లను రేట్లు పెంచుకుని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ మార్కెట్ టెస్లాకు భారంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక, వాణిజ్య శాఖలు సైతం టెస్లా డిమాండ్లను సమీక్షించినప్పటికీ.. స్పందించేందుకు మాత్రం నిరాకరిస్తున్నాయి. టెస్లా అడుగుతోంది ఇదే.. అధిక దిగుమతి సుంకాల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. కష్టమే! ప్రస్తుతం జరగబోయే బడ్జెట్ మీదే టెస్లా ఆశలు పెట్టుకుంది. సమావేశాల్లో దిగుమతి సుంకాల మీద ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూస్తోంది. అయితే ఇది జరగకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు ఏ విదేశీ కంపెనీకి.. ఆ కంపెనీ డిమాండ్ చేసిన మినహాయింపును భారత ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా టెస్లా వినడం లేదు. టెస్లా ప్రతినిధులు ఈమధ్య ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విభాగం అధికారులను కలిశారు. అంతకు ముందు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించి.. ప్రధాని మోదీతో ఎలన్ మస్క్‌కు చర్చించే అవకాశం ఇవ్వమని కోరారు కూడా. గతంలో ఇదే తరహాలో కొన్ని ఫారిన్ కంపెనీలు మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ.. స్థానిక ఉత్పత్తిని ప్రొత్సహించే ఉద్దేశంతో ఆయా కంపెనీల డిమాండ్‌ను కేంద్రం స్వాగతించలేదు. 2017లో యాపిల్ కంపెనీ భారత్‌లో ‘ట్యాక్స్ కన్సెసన్స్’ కావాలని, దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరింది. తద్వారా ఐఫోన్స్ తయారీని స్థానికంగా చేపడతామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ యాపిల్ డిమాండ్లలో చాలామట్టుకును మోదీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ తరుణంలో మేక్ ఇన్ ఇండియా విషయంలో బలంగా ఉన్న మోదీ ప్రభుత్వం.. టెస్లాకు మినహాయింపులు ఇవ్వడం కష్టమే అంటున్నారు అధికారులు. చదవండి: టెస్లా కోసం కేంద్రానికి ఆ రాష్ట్ర మంత్రి లేఖ..! -
ఆదాయపన్ను తగ్గింపు లేదు!
కరోనా విపత్తు వేళ ఎకానమీని పునరుత్తేజం చెందించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు రకరకాల ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇదే కోవలో ఇండియా కూడా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ప్యాకేజీతో సరి అని, ఇప్పట్లో కొత్త ఉద్దీపనలుండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. కొన్నాళ్ల తర్వాత పరిస్థితులను మదింపు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ఇప్పడు వ్యక్తిగత ఆదాయ పన్నులో కానీ, ఇతర పరోక్ష పన్నుల్లో కానీ ఎలాంటి తగ్గింపులు ఉండవని, ఎలాంటి కోతలు ప్రకటించమని తెలియజేశారు. అసలు ఈ సమయంలో ఎలాంటి పన్ను సంబంధిత అంశాలను పరిశీలించడం లేదన్నారు. తాజాగా తాము ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీతో పరిశ్రమలు, వ్యాపారాలు గాడిన పడతాయని, తిరిగి వేతన జీవులకు వేతనాలు అందుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికి కరోనా విపత్తు వేళ రెండు ప్యాకేజీలు ప్రకటించామని గుర్తు చేశారు. ప్రజలకు నగదు సాయం నేరుగా అందించడం లేదన్న విమర్శలకు స్పందిస్తూ.. కేవలం జనం నిత్యావసరాలు కొనుగోళ్లు చేసినంత మాత్రాన డిమాండ్ ఊపందుకోదని వివరించారు. చిన్న వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి రావాలని, వడ్డీ వ్యయాలు తగ్గి మూలధన సాయం పెరగాలని, కంపెనీలు ముడిపదార్ధాల కొనుగోళ్లు జరపాలని.. అప్పుడే క్రమంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ఇలా క్రమానుగత చర్యలను ప్రేరేపించేలా కొత్త ప్యాకేజీ రూపొందించామన్నారు. వ్యాపార పునరుద్ధరణ జరిగితే ఆటోమేటిగ్గా పనిచేసేవారికి వేతనాలు అందుతాయని, దీంతో ప్రజల వద్ద నగదు చేరి, కొనుగోళ్లు పెరుగుతాయని వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు డిమాండ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశీయ కంపెనీల్లో విదేశీ మదుపరులు పెద్ద ఎత్తున వాటాలు కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిమితులు ప్రకటిస్తుందని, చౌకగా దేశీయ కంపెనీలను విదేశీయులు చేజిక్కించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని నిర్మల చెప్పారు. -
చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్‌లైన్ పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్‌డౌన్‌ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్డౌన్ దెబ్బతో ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు వరాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు తీరనున్న నిధుల కష్టాలు.. తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్ భారం తగ్గింది.. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక, బేసిక్ వేతనంలో తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి.. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు. రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్ మెజూర్ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం.. మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు. పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్‌మెంట్స్‌ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31, నవంబర్ 30 దాకాను, ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 దాకా పొడిగించారు. ‘వివాద్ సే విశ్వాస్‘ స్కీమును డిసెంబర్ దాకా పొడిగించారు. వివద్ సే విశ్వాస్ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది. రిఫండ్స్ సత్వరమే దాతృత్వ సంస్థలు, ఎల్ఎల్పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మేలు... ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. – ప్రధాని నరేంద్రమోదీ వృద్ధికి ఊతమిస్తుంది... స్వయం సమృద్ధమైన భారత్‌ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్‌ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి డెవలపర్లకు బూస్ట్... రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ చిన్న సంస్థలకు తక్షణ శక్తి... ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలకు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ కరోనాను ఎదుర్కొనే వ్యూహం... నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్‌ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ దీర్ఘకాల ప్రభావం ఉంటుంది... చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇది మారలేదు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్ జనరల్ -
సుంకం కోత : వివిధ నగరాల్లో పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు డీజిలు ధరలపై కేంద్రం సుంకం తగ్గింపు అనంతరం మెట్రో నగరాల్లో పెట్రో ధరలు శుక్రవారం కాస్త ఉపశమించాయి. ముఖ్యంగా అత్యధిక ధరలను నమోదు చేసిన వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర లీటరు రూ. 86.97, డీజిల్ ధర రూ.77.45 గా ఉంది. ఢిల్లీలో పెట్రోలు ధర 81.50 రూపాయలుగాను, డీజిల్ ధర రూ. 72.50గా ఉంది. హైదరాబాద్: పెట్రోలు ధర లీటరుకు రూ. 86.40 డీజిల్ ధర లీటరుకు 79.35 రూపాయలుగా ఉంది. విజయవాడ: పెట్రోలు ధర లీటరుకు రూ. 84.50 డీజిల్ ధర లీటరుకు 77.11 రూపాయలుగా ఉంది. చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 84.70 డీజిల్ ధర లీటరుకు 77.11 రూపాయలు కోలకతా: పెట్రోలు లీటరుకు 83.35 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 74.80 బెంగళూరు : పెట్రోలు లీటరుకు రూ. 82.14, డీజిల్ ధర లీటరుకు 73.32 రూపాయలుగా ఉంది. రాంచీ : జార్ఖండ్ రాజధాని పెట్రోల్ ధర రూ. 77.91 వద్ద ఉండగా, డీజిల్ రూ .74.51 గురుగ్రామ్: పెట్రోలు ధర లీటరుకు 80.20 రూపాయల మేరకు గుర్గావ్, డీజిల్ రూ. 71.86 చండీగఢ్: పెట్రోలు ధర రూ .78.45, డీజిల్ రూ .70.93 గౌహతి : పెట్రోలు లీటరుకు రూ .78.50, డీజిల్‌కు రూ. 70.97 భూపాల్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 84.69 డీజిల్ లీటరుకు 74.33 రూపాయలు కాగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ప్రకటించారు. అదేవిధంగా సుంకాన్ని తగ్గించాల్సిందిగా ఆయన రాష్ట్రాలకు కూడా సూచించారు. గుజరాత్, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సుంకాన్ని రూ.2.50చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అవి నీ(తి)టి సరఫరా
- అక్రమ కొళాయిల పన్ను సైతం హాంఫట్ - డిపాజిట్ రూపంలో వచ్చిన రూ. 1.80 కోట్లు స్వాహా! కదిరి: పట్టణ మున్సిపాలిటీలో అవినీ(టి)తి సరఫరా అవుతోంది.‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ’ అన్న సామెత ఇద్దరు ఉద్యోగులకు బాగా సరిపోతుంది. పట్టణంలో ఎవరైనా తమ ఇంటికి కొళాయి కనెక్షన్ తీసుకోవాలంటే అధికారికంగా రూ.వేలుతో పాటు రోడ్ కటింగ్ కోసం మరో రూ.300 అదనంగా దండుకుంటున్నారు. డిపాజిట్ రూపంలో వచ్చిన రూ.1.80 కోట్లు స్వాహా చేశారు. పట్టణంలో సక్రమంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న వారు కేవలం 2,230 మంది మాత్రమే ఉన్నారు. వీరు ప్రతినెలా రూ.100 చొప్పున నీటి పన్ను చెల్లిస్తున్నారు. అయితే నీటి విభాగంలో పనిచేసే ఇరువురు ఉద్యోగులకు రూ.3 వేలు ముట్టజెప్పి కొందరు అక్రమ కొళాయి కనెక్షన్లు తీసుకున్నారు. ఇలాంటి వారు పట్టణంలో 6 వేల మంది దాకా ఉన్నారు. అక్రమ కొళాయి కనెక్షన్ల ద్వారా డిపాజిట్ రూపేణా ఆ ఇద్దరి జేబులోకి అక్షరాలా రూ.1.80 కోట్లు వెళ్లింది. పన్ను రశీదులు ఇవ్వరు అక్రమంగా కొలాయి కనెక్షన్ తీసుకున్న వారు ప్రతినెలా వారి చేతికి నీటి పన్ను కూడా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. డిపాజిట్‌కు గాని, ప్రతినెలా చెల్లించే పన్ను డబ్బుకు గాని రసీదులు ఇవ్వలేదు. అక్రమ కొళాయి కనెక్షన్ల ద్వారా ప్రతినెలా రూ6 లక్షలు నీటి పన్ను కూడా వారి జేబులోకే వెళ్తోంది. అంటే ఏడాదికి రూ.72 లక్షలు నీటి పన్ను స్వాహా అవుతోంది. అసలే కదిరి మున్సిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మున్సిపాలిటీ కరెంటు బిల్లు బకాయి సకాలంలో చెల్లించనందుకు ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంతో పాటు పట్టణంలోని వీధి దీపాలకు కూడా కరెంట్ కట్‌చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆ ఇళ్లకు నిత్యం మంచినీటి సరఫరా పార్నపల్లిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిగా అడుగంటి పోవడంతో ఇళ్లకు ఇప్పుడు వారానికోసారి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. అదీకూడా కేవలం ఒక గంట మాత్రమే మంచినీరు సరఫరా అవుతోంది. అయితే అక్రమంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న వారిలో కొన్ని ఇళ్లకు మాత్రం పట్టణంలో ఏ వీధికి మంచినీరు సరఫరా చేసినా ఆ ఇళ్లకు నీరు సరఫరా అవుతోందట. తాము ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నామని, తమకు డైరెక్ట్ లైన్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుందని కొందరు బహిరంగంగా చెప్తున్నారు. ఆ ఇళ్లలో స్నానానికి, దుస్తులు ఉతకడానికి, మరుగుదొడ్లలోనూ మంచినీటినే వాడుతున్నారు. బయటపడింది ఇలా.. అక్రమంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న ఓ వ్యక్తి ఇటీవల మున్సిపల్ కార్యాలయానికొచ్చి ఇంటిపన్ను చెల్లించాలని చెప్పాడు. ‘మీకు కొళాయి కనెక్షన్ లేదే’ అంటూ అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఆయన ముక్కున వేలేసుకున్నారట. తాను ప్రతినెలా సదరు సిబ్బందికి బిల్లు చెల్లిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో ‘అలా చెల్లించినట్లు రసీదులేమైనా ఉన్నాయా’ అని మున్సిపల్ అ««ధికారులు ప్రశ్నించారు. తన దగ్గర డిపాజిట్‌కు గానీనెలనెలా చెల్లించిన పన్నుకు గాని రసీదులు లేవని చెప్పడంతో ‘నీ ఖర్మ’ అంటూ చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయం మున్సిపల్ కార్యాలయంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ ఆ ఇద్దరు ఉద్యోగులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి నీళ్ల వ్యాపారం మూడు కొళాయిలు..ఆరు కాసులు అన్న చందంగా కొనసాగుతోందని తోటి సిబ్బందే అంటున్నారు. విచారించి తగు చర్యలు తీసుకుంటాం నీటి పన్ను వందశాతం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్రమ కొళాయి కనెక్షన్ల విషయం నా దృష్టికి రాలేదు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లి అక్రమ కొళాయి కనెక్షన్ల భాగోతాన్ని బయటపెడతాం. నిజమని తేలితే బా«ధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. కొలాయి కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్యాలయానికి నేరుగా వచ్చి బిల్లు చెల్లించి, ఆన్లైన్ రసీదు పొందొచ్చు. - మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్ -
ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ?
ముంబై : అమెరికా అధ్యక్షుడు బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ ప్లాన్ ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్యాక్స్ కట్ ప్లాన్ అమెరికా కంపెనీలకు మేజర్ బూస్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఎమర్జింగ్ మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతమున్న ఏడు ట్యాక్స్ బ్రాకెట్లను మూడింటికి కుందించింది. దీంతో పబ్లిక్ కార్పొరేషన్లకు విధించే పన్ను రేట్లు 35 శాతం నుంచి 15 శాతానికి దిగొచ్చాయి. అంతేకాక, చిన్న వ్యాపారాలకు 39.6 శాతం పన్ను రేటు, 15 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే విదేశాల్లో లాభాలు ఆర్జించి వాటిని దేశానికి తీసుకురావాలంటే మాత్రం 15 శాతం పన్నును భరించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు కనుక ఒకవేళ చట్టపరమైతే, ఎక్కువగా పన్నులు వేస్తున్న 20 దేశాల జాబితాల్లో తక్కువ పన్ను కలిగిన దేశంగా అమెరికా చరిత్రలోకి ఎక్కనుంది. దీంతో అమెరికా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుతుందని, ఇన్వెస్టర్లందరూ ఆ దేశంవైపు చూస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ కూడా బలపడనుందని వెల్లడవుతోంది. అనుకున్నంత మేర భారత్ కు దెబ్బతగలన్నప్పటికీ, ఇతర వర్ధమాన దేశాలకు మాత్రం నష్టమేనని ఐసీఐసీఐ సెక్యురిటీస్ లిమిటెడ్ రవి సుందర్ ముత్తుక్రిష్ణన్ తెలిపారు. పన్ను కోతతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ఇన్ప్లోలన్నీ అమెరికాకు వెళ్తాయని ఆయన చెప్పారు. కేవలం ఒక్క పేజీలోనే ట్రంప్ కార్యాలయం ఈ ప్రతిపాదనలను విడుదల చేసింది. అయితే సమగ్ర సమాచారం ఇవ్వడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమై, పెట్టుబడిదారులను నిరాశపరిచింది. మరోవైపు అమెరికా కంపెనీలకు ఎక్కువ లాభాలు, ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడులకు దోహదం చేస్తాయని మైనార్టి కాంట్రారియన్ సిద్ధాంతం చెబుతోంది. ఇది సానుకూల సంస్కరణ అని పేర్కొంటోంది. అయితే ట్రంప్ ట్యాక్స్ కట్ ప్లాన్ పెట్టుబడిదారులను నిరాశపరచడంతో, రెండేళ్ల గరిష్టంలో ఎగిసిన ఆసియన్ షేర్లు జోరు తగ్గించాయి. -
బడ్జెట్లో పన్నుల కోత!
డిమాండ్ పెంచేందుకు సర్కారు చర్యలు • నోట్ల రద్దు ప్రతికూలతలను చక్కదిద్దే యత్నం • విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర సర్కారు బడ్జెట్లో ప్రోత్సాహక చర్యలు తీసుకోనుందా...? పన్నులను తగ్గించనుందా...? పరిశీలకుల నుంచి ఇప్పుడు ఇవే అంచనాలు వెలువడుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే బడ్జెట్లో పన్నులను తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఎక్కువ మంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, అదే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పరోక్ష పన్ను వసూళ్లపై కచ్చితమైన అంచనాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల అంచనాల ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు చేయడం సాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రస్తుత పన్ను చట్టాలకు అనుగుణంగా ప్రత్యక్ష పన్ను (వ్యక్తులు చెల్లించేది) వసూళ్లు ఎంత వస్తాయన్న దానిపై ప్రభుత్వం వద్ద అంచనాలు ఉన్నాయి. కానీ, జూలై 1 నుంచి ప్రస్తుతమున్న అన్ని పన్ను చట్టాల స్థానంలో జీఎస్టీని అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. కొత్త పన్ను చట్టం దృష్ట్యా పరోక్ష పన్నుల (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్) వసూళ్లపై కచ్చితమైన అంచనాలు లేవు. జీఎస్టీ పన్ను అంచనాల్లోకి రాష్ట్రాల వ్యాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే పలు రకాల ఉత్పత్తులు, రంగాల వారీగా జీఎస్టీలో భిన్నమైన పన్ను రేట్లు ఉండనున్నాయి. వీటిపై ఎంత పన్ను అన్నది తేలకుండా జీఎస్టీ వసూళ్లపై కచ్చిత అంచనాలకు రాలేమన్నది ఓ నిపుణుడి అభిప్రాయం. అయినప్పటికీ ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను రాబడి అంచనాతోపాటు పరోక్ష పన్నులైన కస్టమ్స్ డ్యూటీ వంటి అంచనాలు పేర్కొనడం ద్వారా, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు చేసే అవకాశాలు ఉన్నాయన్నది మరో నిపుణుడి విశ్లేషణ. తటస్థమే... మోర్గాన్ స్టాన్లీ బడ్జెట్లో పన్నులను తగ్గించే అవకాశాలను ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ మోర్గాన్ స్టాన్లీ తోసిపుచ్చింది. విధానపరమైన వైఖరిని పాలకులు మార్చుకునే అవకాశాల్లేవని అభిప్రాయ పడింది. బడ్జెట్ తటస్థంగా ఉంటుందని, పెద్ద మార్పులను తామేమీ ఆశించడం లేదని తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్‌పై స్వల్ప కాలంలో బడ్జెట్ ప్రభావం తక్కువేనని మోర్గాన్ స్టాన్లీ ఇండియా స్ట్రాటజిస్ట్ రిదమ్ దేశాయ్ పేర్కొన్నారు. బడ్జెట్ రోజున కొంత మేర అస్థిరత ఉండడం సాధారణమేనని, అయితే, ఈ ఆటుపోట్లన్నవి గత 25 ఏళ్లుగా తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. ఈ రంగాలకు అనుకూలం ఆటో, సిమెంట్, మెటల్స్, కన్జ్యూమర్, ఇంటర్నెట్, ఈ కామర్స్, మీడియా, రియల్టీ రంగాలకు బడ్జెట్ అనుకూలంగా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక సేవలు, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీ రంగాలకు తటస్థంగా ఉంటుందని తెలిపింది. ద్రవ్య స్థిరీకరణ అన్నది గతంలో వేసిన ప్రణాళిక కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. 2016–17లో ద్రవ్యలోటు 3.3 శాతమని అంచనా వేయగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 3.5 శాతం ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపులకు సమగ్ర వ్యూహం.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే దిశగా బడ్జెట్లో చర్యలు ఉండాలని క్లోన్ ఫ్యూచురా ఎడ్యుకేషన్ విదుషీ దాగా అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల భద్రతపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్ధం క్రెడిట్, డెబిట్ కార్డులు అన్ని చోట్లా పనిచేసేలాగా, వివిధ పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) మాధ్యమాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మరోవైపు, పాఠశాల స్థాయిలో కూడా చదువుతో పాటు నైపుణ్యాల్లోనూ శిక్షణ కల్పించే చర్యలు అవసరమని విదుషీ పేర్కొన్నారు. మరోవైపు వాయుకాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని నివారించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫండ్ ఏర్పాటు చేయాలని బ్లూఎయిర్ సంస్థ డైరెక్టర్ (దక్షిణ, పశ్చిమాసియా విభాగం) గిరీష్ బాపట్ అభిప్రాయపడ్డారు. కాలుష్యాన్ని తగ్గించే సెన్సార్స్ మొదలైనవాటిని తయారు చేసే స్టార్టప్స్‌కి ఆర్థికంగా చేయూతనివ్వాలని పేర్కొన్నారు. మరిన్ని క్లీన్ ఎయిర్ రీసెర్చ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు అందించాలన్నారు.