అవి నీ(తి)టి సరఫరా | illegal tap connection in kadiri | Sakshi
Sakshi News home page

అవి నీ(తి)టి సరఫరా

Published Sat, Aug 19 2017 1:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

అవి నీ(తి)టి సరఫరా

అవి నీ(తి)టి సరఫరా

- అక్రమ కొళాయిల పన్ను సైతం హాంఫట్‌
- డిపాజిట్‌ రూపంలో వచ్చిన రూ. 1.80 కోట్లు స్వాహా!


కదిరి: పట్టణ మున్సిపాలిటీలో అవినీ(టి)తి సరఫరా అవుతోంది.‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ’ అన్న సామెత ఇద్దరు ఉద్యోగులకు బాగా సరిపోతుంది. పట్టణంలో ఎవరైనా తమ ఇంటికి కొళాయి కనెక‌్షన్‌ తీసుకోవాలంటే అధికారికంగా రూ.వేలుతో పాటు రోడ్‌ కటింగ్‌ కోసం మరో రూ.300 అదనంగా దండుకుంటున్నారు. డిపాజిట్‌ రూపంలో వచ్చిన రూ.1.80 కోట్లు స్వాహా చేశారు.

పట్టణంలో సక్రమంగా కొళాయి కనెక‌్షన్‌ తీసుకున్న వారు కేవలం 2,230 మంది మాత్రమే ఉన్నారు. వీరు ప్రతినెలా రూ.100 చొప్పున నీటి పన్ను చెల్లిస్తున్నారు. అయితే నీటి విభాగంలో పనిచేసే ఇరువురు ఉద్యోగులకు రూ.3 వేలు ముట్టజెప్పి కొందరు అక్రమ కొళాయి కనెక‌్షన్లు తీసుకున్నారు. ఇలాంటి వారు పట్టణంలో 6 వేల మంది దాకా ఉన్నారు. అక్రమ కొళాయి కనెక‌్షన్ల ద్వారా డిపాజిట్‌ రూపేణా ఆ ఇద్దరి జేబులోకి అక్షరాలా రూ.1.80 కోట్లు వెళ్లింది.

పన్ను రశీదులు ఇవ్వరు
అక్రమంగా కొలాయి కనెక‌్షన్‌ తీసుకున్న వారు ప్రతినెలా వారి చేతికి నీటి పన్ను కూడా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. డిపాజిట్‌కు గాని, ప్రతినెలా చెల్లించే పన్ను డబ్బుకు గాని రసీదులు ఇవ్వలేదు. అక్రమ కొళాయి కనెక్షన్‌ల ద్వారా ప్రతినెలా రూ6 లక్షలు నీటి పన్ను కూడా వారి జేబులోకే వెళ్తోంది. అంటే ఏడాదికి రూ.72 లక్షలు నీటి పన్ను స్వాహా అవుతోంది. అసలే కదిరి మున్సిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మున్సిపాలిటీ కరెంటు బిల్లు బకాయి సకాలంలో చెల్లించనందుకు ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు మున్సిపల్‌ కార్యాలయంతో పాటు పట్టణంలోని వీధి దీపాలకు కూడా కరెంట్‌ కట్‌చేసిన సందర్భాలు కోకొల్లలు.

ఆ ఇళ్లకు నిత్యం మంచినీటి సరఫరా
పార్నపల్లిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నీటిమట్టం పూర్తిగా అడుగంటి పోవడంతో ఇళ్లకు ఇప్పుడు వారానికోసారి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. అదీకూడా కేవలం ఒక గంట మాత్రమే మంచినీరు సరఫరా అవుతోంది. అయితే అక్రమంగా కొళాయి కనెక‌్షన్‌ తీసుకున్న వారిలో కొన్ని ఇళ్లకు మాత్రం పట్టణంలో ఏ వీధికి మంచినీరు సరఫరా చేసినా ఆ ఇళ్లకు నీరు సరఫరా అవుతోందట. తాము ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నామని, తమకు డైరెక్ట్‌ లైన్‌ ద్వారా మంచినీరు సరఫరా అవుతుందని కొందరు బహిరంగంగా చెప్తున్నారు. ఆ ఇళ్లలో స్నానానికి, దుస్తులు ఉతకడానికి, మరుగుదొడ్లలోనూ మంచినీటినే వాడుతున్నారు.

బయటపడింది ఇలా..
అక్రమంగా కొళాయి కనెక్షన్‌ తీసుకున్న ఓ వ్యక్తి ఇటీవల మున్సిపల్‌ కార్యాలయానికొచ్చి ఇంటిపన్ను చెల్లించాలని చెప్పాడు. ‘మీకు కొళాయి కనెక‌్షన్‌ లేదే’  అంటూ అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఆయన ముక్కున వేలేసుకున్నారట. తాను ప్రతినెలా సదరు సిబ్బందికి బిల్లు చెల్లిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో ‘అలా చెల్లించినట్లు రసీదులేమైనా ఉన్నాయా’ అని మున్సిపల్‌ అ««ధికారులు ప్రశ్నించారు. తన దగ్గర డిపాజిట్‌కు గానీనెలనెలా చెల్లించిన పన్నుకు గాని రసీదులు లేవని చెప్పడంతో ‘నీ ఖర్మ’ అంటూ చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయం మున్సిపల్‌ కార్యాలయంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ ఆ ఇద్దరు ఉద్యోగులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి నీళ్ల వ్యాపారం మూడు కొళాయిలు..ఆరు కాసులు అన్న చందంగా కొనసాగుతోందని తోటి సిబ్బందే అంటున్నారు.

విచారించి తగు చర్యలు తీసుకుంటాం
నీటి పన్ను వందశాతం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్రమ కొళాయి కనెక‌్షన్ల విషయం నా దృష్టికి రాలేదు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లి అక్రమ కొళాయి కనెక‌్షన్ల భాగోతాన్ని బయటపెడతాం. నిజమని తేలితే బా«ధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. కొలాయి కనెక‌్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ మున్సిపల్‌ కార్యాలయానికి నేరుగా వచ్చి బిల్లు చెల్లించి, ఆన్‌లైన్‌ రసీదు పొందొచ్చు.
- మున్సిపల్‌ కమిషనర్‌ భవానిప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement