చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్‌ లవ్‌ స్టోరీ..! | Valentines Day 2025: 15th Century Love Story Chandravadan And Mohiyar | Sakshi
Sakshi News home page

చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్‌ లవ్‌ స్టోరీ..!

Published Fri, Feb 14 2025 9:49 AM | Last Updated on Fri, Feb 14 2025 9:50 AM

Valentines Day 2025: 15th Century Love Story Chandravadan And Mohiyar

చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్‌ లవ్‌ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.

క‌దిరి న‌ర‌సింహా దేవాల‌యంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్‌ దేశం నుంచి మోహియార్‌ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్ర‌వ‌ద‌న‌ స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. 

అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్‌ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్‌ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. 

దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. 

అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్‌ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. 

ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్‌ అనే పేరులు పెట్టుకుని ఆ అమ‌ర ప్రేమికుల‌ను ఇప్ప‌టికీ త‌లుచుకుంటూనే ఉన్నారు. 

అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.

(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్‌ ఏంటంటే..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement