కరోనా విపత్తు వేళ ఎకానమీని పునరుత్తేజం చెందించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు రకరకాల ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇదే కోవలో ఇండియా కూడా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ప్యాకేజీతో సరి అని, ఇప్పట్లో కొత్త ఉద్దీపనలుండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. కొన్నాళ్ల తర్వాత పరిస్థితులను మదింపు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ఇప్పడు వ్యక్తిగత ఆదాయ పన్నులో కానీ, ఇతర పరోక్ష పన్నుల్లో కానీ ఎలాంటి తగ్గింపులు ఉండవని, ఎలాంటి కోతలు ప్రకటించమని తెలియజేశారు. అసలు ఈ సమయంలో ఎలాంటి పన్ను సంబంధిత అంశాలను పరిశీలించడం లేదన్నారు. తాజాగా తాము ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీతో పరిశ్రమలు, వ్యాపారాలు గాడిన పడతాయని, తిరిగి వేతన జీవులకు వేతనాలు అందుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికి కరోనా విపత్తు వేళ రెండు ప్యాకేజీలు ప్రకటించామని గుర్తు చేశారు.
ప్రజలకు నగదు సాయం నేరుగా అందించడం లేదన్న విమర్శలకు స్పందిస్తూ.. కేవలం జనం నిత్యావసరాలు కొనుగోళ్లు చేసినంత మాత్రాన డిమాండ్ ఊపందుకోదని వివరించారు. చిన్న వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి రావాలని, వడ్డీ వ్యయాలు తగ్గి మూలధన సాయం పెరగాలని, కంపెనీలు ముడిపదార్ధాల కొనుగోళ్లు జరపాలని.. అప్పుడే క్రమంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ఇలా క్రమానుగత చర్యలను ప్రేరేపించేలా కొత్త ప్యాకేజీ రూపొందించామన్నారు. వ్యాపార పునరుద్ధరణ జరిగితే ఆటోమేటిగ్గా పనిచేసేవారికి వేతనాలు అందుతాయని, దీంతో ప్రజల వద్ద నగదు చేరి, కొనుగోళ్లు పెరుగుతాయని వివరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు డిమాండ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశీయ కంపెనీల్లో విదేశీ మదుపరులు పెద్ద ఎత్తున వాటాలు కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిమితులు ప్రకటిస్తుందని, చౌకగా దేశీయ కంపెనీలను విదేశీయులు చేజిక్కించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని నిర్మల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment