బడ్జెట్‌లో పన్నుల కోత! | FM Arun Jaitley may cut taxes, lack of indirect-tax data may make it tough | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో పన్నుల కోత!

Published Fri, Jan 27 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

బడ్జెట్‌లో పన్నుల కోత!

బడ్జెట్‌లో పన్నుల కోత!

డిమాండ్‌ పెంచేందుకు సర్కారు చర్యలు
నోట్ల రద్దు ప్రతికూలతలను చక్కదిద్దే యత్నం
విశ్లేషకుల అభిప్రాయం


న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర సర్కారు బడ్జెట్‌లో ప్రోత్సాహక చర్యలు తీసుకోనుందా...? పన్నులను తగ్గించనుందా...? పరిశీలకుల నుంచి ఇప్పుడు ఇవే అంచనాలు వెలువడుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిమాండ్‌ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే బడ్జెట్‌లో పన్నులను తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఎక్కువ మంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, అదే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పరోక్ష పన్ను వసూళ్లపై కచ్చితమైన అంచనాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.

ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల అంచనాల ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు చేయడం సాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రస్తుత పన్ను చట్టాలకు అనుగుణంగా ప్రత్యక్ష పన్ను (వ్యక్తులు చెల్లించేది) వసూళ్లు ఎంత వస్తాయన్న దానిపై ప్రభుత్వం వద్ద అంచనాలు ఉన్నాయి. కానీ, జూలై 1 నుంచి ప్రస్తుతమున్న అన్ని పన్ను చట్టాల స్థానంలో జీఎస్టీని అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. కొత్త పన్ను చట్టం దృష్ట్యా పరోక్ష పన్నుల (కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌) వసూళ్లపై కచ్చితమైన అంచనాలు లేవు. జీఎస్టీ పన్ను అంచనాల్లోకి రాష్ట్రాల వ్యాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.

ఎందుకంటే పలు రకాల ఉత్పత్తులు, రంగాల వారీగా జీఎస్టీలో భిన్నమైన పన్ను రేట్లు ఉండనున్నాయి. వీటిపై ఎంత పన్ను అన్నది తేలకుండా జీఎస్టీ వసూళ్లపై కచ్చిత అంచనాలకు రాలేమన్నది ఓ నిపుణుడి అభిప్రాయం. అయినప్పటికీ ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను రాబడి అంచనాతోపాటు పరోక్ష పన్నులైన కస్టమ్స్‌ డ్యూటీ వంటి అంచనాలు పేర్కొనడం ద్వారా, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు చేసే అవకాశాలు ఉన్నాయన్నది మరో నిపుణుడి విశ్లేషణ.

తటస్థమే... మోర్గాన్‌ స్టాన్లీ
బడ్జెట్‌లో పన్నులను తగ్గించే అవకాశాలను ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ మోర్గాన్‌ స్టాన్లీ తోసిపుచ్చింది. విధానపరమైన వైఖరిని పాలకులు మార్చుకునే అవకాశాల్లేవని అభిప్రాయ పడింది. బడ్జెట్‌ తటస్థంగా ఉంటుందని, పెద్ద మార్పులను తామేమీ ఆశించడం లేదని తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్‌పై స్వల్ప కాలంలో బడ్జెట్‌ ప్రభావం తక్కువేనని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా స్ట్రాటజిస్ట్‌ రిదమ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ రోజున కొంత మేర అస్థిరత ఉండడం సాధారణమేనని, అయితే, ఈ ఆటుపోట్లన్నవి గత 25 ఏళ్లుగా తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది.

ఈ రంగాలకు అనుకూలం
ఆటో, సిమెంట్, మెటల్స్, కన్జ్యూమర్, ఇంటర్నెట్, ఈ కామర్స్, మీడియా, రియల్టీ రంగాలకు బడ్జెట్‌ అనుకూలంగా ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక సేవలు, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, యుటిలిటీ రంగాలకు తటస్థంగా ఉంటుందని తెలిపింది. ద్రవ్య స్థిరీకరణ అన్నది గతంలో వేసిన ప్రణాళిక కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. 2016–17లో ద్రవ్యలోటు 3.3 శాతమని అంచనా వేయగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 3.5 శాతం ఉన్నట్టు తెలిపింది.

డిజిటల్‌ చెల్లింపులకు సమగ్ర వ్యూహం..
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేలా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే దిశగా బడ్జెట్‌లో చర్యలు ఉండాలని క్లోన్‌ ఫ్యూచురా ఎడ్యుకేషన్‌ విదుషీ దాగా అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల భద్రతపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్ధం క్రెడిట్, డెబిట్‌ కార్డులు అన్ని చోట్లా పనిచేసేలాగా, వివిధ పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) మాధ్యమాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

మరోవైపు, పాఠశాల స్థాయిలో కూడా చదువుతో పాటు నైపుణ్యాల్లోనూ శిక్షణ కల్పించే చర్యలు అవసరమని విదుషీ పేర్కొన్నారు. మరోవైపు వాయుకాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని నివారించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని బ్లూఎయిర్‌ సంస్థ డైరెక్టర్‌ (దక్షిణ, పశ్చిమాసియా విభాగం) గిరీష్‌ బాపట్‌ అభిప్రాయపడ్డారు. కాలుష్యాన్ని తగ్గించే సెన్సార్స్‌ మొదలైనవాటిని తయారు చేసే స్టార్టప్స్‌కి ఆర్థికంగా చేయూతనివ్వాలని పేర్కొన్నారు. మరిన్ని క్లీన్‌ ఎయిర్‌ రీసెర్చ్‌ కేంద్రాల ఏర్పాటుకు నిధులు అందించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement