మెరుపుల్లేని బడ్జెట్
రైల్వే బడ్జెట్‌లాంటి పెద్ద పద్దును విలీనం చేసుకుని బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చిన సాధారణ బడ్జెట్ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినంత వరకూ క్షేత్ర స్థాయి వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఆ నిర్ణయానికి తన బడ్జెట్ ప్రతిపాదనలు కొనసాగింపేనని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడంతోపాటు దానివల్ల నరకయాతన అనుభవించిన సాధారణ ప్రజలకూ, నష్టపోయిన చిన్న వ్యాపారులకూ కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఆ పని చేస్తూనే రద్దు నిర్ణయం వల్ల గొప్ప మేలు జరిగిందని సమర్ధించుకోవడం మోదీ ప్రభుత్వ విధానం కొనసాగింపే. జైట్లీ బడ్జెట్ ప్రసంగం కంటే ఆర్థిక సర్వే తయారు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నివేదిక క్షేత్ర వాస్తవికతకు దగ్గరగా ఉంది.
నోట్ల రద్దు నిర్ణయం వల్ల జాతీయోత్పత్తి రేటు తగ్గి నట్టు సుబ్రమణియన్ అంగీకరించారు కానీ జైట్లీ దబాయింపు ధోరణినే కొనసా గించారు. నోట్లరద్దు వల్ల కలిగిన నష్టం తాలూకు వివరాలు మాత్రం వెల్లడించ లేదు. ఈ చర్యవల్ల బ్యాంకులలో జమ అయిన మొత్తాల వివరాలను అధ్యయనం చేసి పన్ను వసూళ్ళ వ్యవస్థను విస్తరించి బలోపేతం చేస్తామంటున్నారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ నిర్మాణానికి దోహదం చేసే దారులు వేస్తామంటున్నారు. ప్రత్యేకంగా చెప్పకపోయినా నోట్లరద్దు వల్ల మనస్తాపం కలిగిన పేదప్రజలను శాంతింప జేసే ఉద్దేశంతోనే గ్రామీణ ఉపాధి కల్పన పథకం ఖర్చు పెంచాలని ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచబోతున్నట్టు చెప్పారు. ఆదాయంపన్నులో రాయితీ కూడా ఈ ఉద్దేశంతో ప్రకటించిందే.
పార్టీలు సేకరించే విరాళాల విషయంలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేసినందుకు ఆర్థికమంత్రిని అభినందించాలి. ఇప్పటిదాకా రూ. 20 వేల వరకూ నగదు రూపంలో వచ్చే విరాళాలకు దాతల వివరాలు చెప్పనక్కరలేదు. ఇకమీదట ఆ పరిమితి రూ. 2 వేలకు తగ్గుతుంది. అయితే నగదు వివరాలు చెప్పనక్కరలేదనే నిబంధన ఉన్నప్పుడు దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకూ కోట్ల రూపాయల నల్లధనాన్ని విరాళాలుగా తీసుకొని తలా రూ.20వేల చొప్పున వందలమంది పేర్లు దాతలుగా రాయడం పరిపాటి. ఇప్పుడు వేల పేర్లు రాయగలరు. ఆ పేరు గలవారు ఉన్నారో లేదో, నిజంగా వారు విరాళం ఇచ్చారో లేదో తెలుసుకునే వ్యవస్థ లేనంతవరకూ అది నల్లధనం పెరగ డానికే దోహదపడుతుంది.
ఆదాయంపన్నులో రాయితీ ఇవ్వడం ఉద్యోగవర్గా లనూ, మధ్యతరగతినీ సంతోషపెట్టే చర్య. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ, వ్యాపార సంస్థలకూ పన్ను రాయితీలు ఇవ్వడం కూడా ఆహ్వానించదగిన ప్రతి పాదన. దేశంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. సాలీనా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా మోదీ ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగాల సంఖ్య లక్షలలోనే. మెలకువలను (స్కిల్స్) నేర్పి ఉపాధి కల్పించే పథకం ప్రయోజనకరమైనదే కానీ దాని విస్తృతి పరిమితమైనది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా, వ్యవ సాయ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరగాలి. బడ్జెట్ ప్రతిపాదనలలో అది కనిపించదు.
గ్రామీణరంగంలో ప్రభుత్వం ఖర్చు పెంచుతుందనీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందనీ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపైనా, గ్రామీణ రహదారులపైనా, విద్యుదీకరణపైనా ఖర్చు చేస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని ఐదేళ్ళలో రెట్టింపు చేస్తామని కూడా ప్రకటించారు. ఎట్లా చేస్తారో వివరించలేదు. నిజంగా అన్నదాతను ఆదుకోవాలన్న సంకల్పం ఉంటే వారిని రుణ విముక్తులను చేయాలి. రైతులు కోరుకుంటున్నదీ అదే. 1998 నుంచి దేశంలో రైతులు ఆర్థికంగా చితికిపోయి, అప్పుల ఊబిలో దిగబడి దిక్కుతోచక లక్షల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ఈ దుస్థితి విదర్భ, తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతా లలోనే ఉండేది. ఇప్పుడు కోస్తాంధ్ర, పంజాబ్ వంటి సాగునీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో కూడా ఎరువులపైనా, క్రిమిసంహారక ఔషధాలపైనా శక్తికిమించి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు బలన్మరణం చెందు తున్నారు. వీరిని ఆదుకోవడానికి జైట్లీ చేసిందేమీ లేదు.
దళితులకూ, మహిళలకూ, మైనారిటీలకూ బడ్జెట్ ప్రతిపాదనలలో రాయితీలు ఉన్నాయంటూ గట్టిగా వినబడినా అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాబోలు వాటిని ప్రకటించలేదు. వాస్తవానికి నోట్ల రద్దు ఫలితంగా బ్యాంకులకు వచ్చి చేరిన ధనంలో కొంత భాగం రిజర్వ్‌బ్యాంక్‌కి బాండ్లు ఇవ్వడం ద్వారా కేంద్రం స్వీకరించి జనధన్‌యోజన ఖాతాలలో జమచేస్తుందంటూ ఊహాగానాలు సాగాయి. ఆ పని చేయకుండా నిగ్రహం ప్రదర్శించినందుకు అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులోని హామీలను, ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీని ఆర్థికమంత్రి ప్రస్తావించకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఊసు ఎత్తకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి నిరాశకు గురి చేసింది. ప్రజల హృదయాలకు చేసిన గాయాలు మాన్పడానికి ప్రభుత్వాలు బడ్జెట్ ప్రతిపాదనలను వినియోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ జైట్లీ అలాంటి ప్రయత్నమే చేయలేదు.
దీన్ని చంద్రబాబు కనీసం ప్రశ్నించకపోగా బడ్జెట్‌కు అభినందనలు తెలుప డమే దురదృష్టకరం. అమరావతి నిర్మాణంకోసం భూములను ప్రభుత్వానికి అప్ప గించిన (ల్యాండ్‌పూలింగ్) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాణిజ్య భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపైన పన్ను (మూలధనంపైన పన్ను) ఉండ బోదని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఆచరణలో ఎవరికి ప్రయోజనకరమో చూడ వలసి ఉంటుంది. ఈ రాయితీవల్ల కొంతమందికి ప్రయోజనం సిద్ధించినా అది ప్రజలందరూ కోరుకునే ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాజాలదు. మొత్తానికి ఏ మెరుపులూ లేని, ఎవరికీ పెద్దగా సంతృప్తి కలిగించని సాదా సీదా బడ్జెట్‌గా ఇది మిగిలిపోయింది.