న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది.
ఏడాది చివరి వరకు విరామం..
కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్‌ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment