న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్‌వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ‘ప్రణాళిక అమల్లోకి తెచ్చిన మూడో పని దినం సాయంత్రం 6 గం.లకు మారటోరియం తొలగిపోతుంది. ఆ పైన 7 రోజుల తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుంది’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
ఎన్‌పీఏల ఒత్తిడి కొనసాగుతుంది..
మొండిబాకీలు తీవ్రం కావడంతో భారీనష్టాలు ప్రకటించిన యస్ బ్యాంక్ .. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పరమైన ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొత్తగా వచ్చే రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంక్ నిలదొక్కుకోగలదని, సమస్యలను అధిగమించగలదని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
షేర్లకు మూడేళ్ల లాకిన్..
పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు. ఇతర ఇన్వెస్టర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల పెట్టుబడుల్లో 75 శాతం షేర్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తమ దగ్గరున్న మొత్తం షేర్లలో 25 శాతానికి మించి విక్రయించుకోవడానికి వీలు ఉండదు. అయితే, 100 లోపు షేర్లు ఉన్న వారికి ఈ లాకిన్ పీరియడ్ వర్తించదు. నోటిఫికేషన్ ప్రకారం.. యస్ బ్యాంక్‌లో 49% వాటాలు తీసుకునే ఎస్‌బీఐ.. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఒకరు లేదా అదనంగా మరింత మంది డైరెక్టర్లను నియమించవచ్చు. ఎస్‌బీఐ మినహా 15 శాతం వోటింగ్ హక్కులు ఉన్న ఇతర ఇన్వెస్టర్లు ఒక్కొక్క డైరెక్టరు చొప్పున యస్ బ్యాంక్ బోర్డుకు నామినేట్ చేయొచ్చు. పునరుదద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్ బ్యాంక్ అధీకృత మూలధనం రూ. 6,200 కోట్లుగా ఉంటుంది. యస్ బ్యాంక్ ఉద్యోగులు గత జీతభత్యాలు, సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. అయితే ‘మేనేజ్‌మెంట్‌లో కీలక ఉద్యోగుల’ సేవలను కొత్త బోర్డు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది.
క్యూ3 నష్టాలు రూ.18,654 కోట్లు
భారీగా పెరిగిన మొండి భారం
ముంబై: కష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంక్ ను తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మరింత నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2019–20, క్యూ3)లో రూ.18,654 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,009 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కేటాయింపులు కూడా బాగా పెరగడం, డిపాజిట్లు తరిగిపోవడంతో నికర నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయి. కాగా ఈ ఏడాది క్యూ2లో నష్టాలు రూ.600 కోట్లు. స్థూల మొండి బాకీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.40,709 కోట్లకు(18.87 శాతం) ఎగిశాయి. నికర మొండి బకాయిలు 5.97 శాతానికి చేరాయి.
‘యస్’పై 18న మారటోరియం ఎత్తివేత
Published Mon, Mar 16 2020 5:15 AM | Last Updated on Mon, Mar 16 2020 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment