ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్‌ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్‌బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు.
ఇండస్‌ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది
బ్యాంకు యాజమాన్యం ప్రకటన
న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్‌ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్‌ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్‌పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్‌పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్‌పోజర్ లేదని స్పష్టం చేసింది.
యస్‌పై మారటోరియం ఎత్తివేత
Published Thu, Mar 19 2020 5:07 AM | Last Updated on Thu, Mar 19 2020 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment