సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో పడిన ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్‌బీఐ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తక్షణ మూలధన అవసరాల నిమిత్తం రూ. 1100 కోట్ల నుంచి రూ. 6200 కోట్లకు పెంచినట్టు ఆమె ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో బ్యాంక్ పునర్నిర్మాణ పథకాన్ని ఆమోదించామనీ, ప్రధానంగా డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎస్‌బీఐ షేర్లకు 26 శాతం చొప్పున మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల 75 శాతం పెట్టుబడులకు మూడేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుందని చెప్పారు. ఇతర పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల (వర్కింగ్) తరువాత మారటోరియం ఎత్తివేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. అలాగే బోర్డులో కనీసం ఇద్దర డైరెక్టర్లు ఎస్‌బీఐకి చెందినవారు వుంటారు. మరోవైపు యస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సుమారు 1.35 బిలియన్ షేర్లను రూ .10 చొప్పున కొనుగోలు చేయనుంది. అలాగే ఈక్విటీ ద్వారా రూ .1000 కోట్ల పెట్టబడులను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment