కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడుతున్న నిర్మాలా సీతారామన్. చిత్రంలో మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్‌బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్‌ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్‌బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్‌బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్‌బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు.
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ పెట్టుబడులు..
యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది.
రాణా కపూర్‌పై మరో సీబీఐ కేసు..
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు.
ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది.
అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.
దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది.
పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment