యస్‌ బ్యాంక్‌ స్కామ్‌పై సీబీ‘ఐ’ | CBI investigation into Yes Bank deals with DHFL gathers steam | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంక్‌ స్కామ్‌పై సీబీ‘ఐ’

Published Tue, Mar 10 2020 4:21 AM | Last Updated on Tue, Mar 10 2020 4:21 AM

CBI investigation into Yes Bank deals with DHFL gathers steam - Sakshi

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నుంచి యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కుటుంబానికి రూ. 600 కోట్లు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సోమవారం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో అయిదు కంపెనీలు,  రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు (రోష్ని, రాఖీ, రాధ) సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ప్రమోటరు కపిల్‌ వాధ్వాన్, ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ రాజేష్‌ కుమార్‌ వాధ్వాన్‌లు వీరిలో ఉన్నారు.

ఇక, కంపెనీల విషయానికొస్తే.. డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్, కపూర్‌ కుటుంబ సారథ్యంలోని డూఇట్‌ అర్బన్‌ వెంచర్స్, బిందు కపూర్‌ డైరెక్టరుగా ఉన్న ఆర్‌ఏబీ ఎంటర్‌ప్రైజెస్, రాణా కపూర్‌ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్న మోర్గాన్‌ క్రెడిట్స్‌ సంస్థలు ఉన్నాయి. ముంబైలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లిపోకుండా.. వారిపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ అయినట్లు పేర్కొన్నాయి.   అటు యస్‌ బ్యాంక్‌ జారీ చేసిన భారీ రుణాలు మొండిబాకీలుగా మారడంపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి పెట్టింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కి మాత్రమే పరిమితం కాకుండా రుణాలు తీసుకున్న ఇతర కంపెనీల నుంచి కూడా కపూర్‌ కుటుంబానికి ముడుపులేమైనా వచ్చాయేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. అటు యస్‌ బ్యాంక్‌ సీఈవో రవ్‌నీత్‌ గిల్‌ను కూడా ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

నిధులు మళ్లించారిలా ..
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు యస్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని కపిల్‌ వాధ్వాన్‌తో కలిసి రాణా కపూర్‌ దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌ – జూన్‌ మధ్యకాలంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన షార్ట్‌ టర్మ్‌ డిబెంచర్లలో యస్‌ బ్యాంక్‌ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో పాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ సంస్థ అయిన ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌కు రూ. 750 కోట్లు రుణం ఇచ్చింది. అయితే, నిర్దేశిత ప్రాజెక్టులో పైసా కూడా పెట్టకుండా ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ మొత్తం రుణం నిధులను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బదలాయించింది. యస్‌ బ్యాంక్‌ నుంచి రుణం లభించినందుకు ప్రతిగా కపూర్‌ కుమార్తెలకు చెందిన డూఇట్‌ అర్బన్‌ వెంచర్స్‌లో వాధ్వాన్‌ దాదాపు రూ. 600 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఇది ఓ రకంగా కపూర్‌కు ముడుపులివ్వడమేనన్నది సీబీఐ ఆరోపణ. సుమారు రూ. 97,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సుమారు రూ.31,000 కోట్ల నిధులు దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి.  

బ్యాంకుల బాండ్లలో రూ. 93,000 కోట్ల పెట్టుబడులు..
దేశీ బ్యాంకులు జారీ చేసిన అదనపు టియర్‌ 1 బాండ్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 93,669 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. యస్‌ బ్యాంక్‌ గానీ దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాండ్లను పూర్తిగా రైటాఫ్‌ చేసిన పక్షంలో ఇన్వెస్టర్లు ఇకపై రిస్కులు తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చని పేర్కొంది.  మరోవైపు, యస్‌ బ్యాంక్‌ సమస్యకు సత్వర పరిష్కారం అమలు చేయడంతో.. సంక్షోభం బ్యాంకింగ్‌ రంగం అంతటా విస్తరించకుండా ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పేర్కొంది.  

ముందే పసిగట్టారా!!
యస్‌ బ్యాంక్‌ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా పలువురు ఖాతాదారులు గతేడాది మార్చి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారీగా విత్‌డ్రా చేసుకున్నారు. ఈ వ్యవధిలో ఏకంగా రూ. 18,100 కోట్ల మేర విత్‌డ్రాయల్‌ లావాదేవీలు నమోదయ్యాయి. మరోవైపు, డిపాజిట్లపై బీమా పరిమాణాన్ని పెంచిన నేపథ్యంలో తమ సొమ్ముకేమీ కాదని భావిస్తున్నట్లు కొందరు డిపాజిటర్లు తెలిపారు. అటు, మరో రెండు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు.. తమ స్కీమ్‌ల నుంచి యస్‌ బ్యాంక్‌ పెట్టుబడులను పక్కకు పెట్టాయి. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఎంఎఫ్, బరోడా ఎంఎఫ్‌ వీటిలో ఉన్నాయి. యస్‌ బ్యాంక్‌ డెట్‌ సాధనాలను రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ‘డి’ స్థాయికి కుదించడం ఇందుకు కారణం.

ఈ వారంలోనే మారటోరియం ఎత్తేయొచ్చు: అడ్మినిస్ట్రేటర్‌ కుమార్‌
పరిస్థితులు చక్కబడితే ఈ వారంలోనే మారటోరియం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ నియమించిన యస్‌ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌బీఐ పెట్టుబడుల ప్రణాళికకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదముద్ర వేస్తే.. యస్‌ బ్యాంక్‌ మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటికి రాగలదన్నారు. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిధుల సమీకరణ కూడా తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని కుమార్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ సేవలన్నీ సాధ్యమైనంత త్వరగా పునరుధ్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా విత్‌డ్రాయల్‌ సదుపాయం అందుబాటులోకి తేగలిగినట్లు చెప్పారు.  డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తామని కుమార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement