ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే .. యస్ బ్యాంక్‌లో ఆర్థిక అవకతవకలు, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్)కు రుణాలిచ్చినందుకు ప్రతిగా దాదాపు రూ. 600 కోట్ల ముడుపులు అందుకున్నారని కూడా రాణా కపూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదనే కారణంతో ఆదివారం ఉదయం సుమారు 3 గం.ల ప్రాంతంలో కపూర్‌ను అదుపులోకి తీసుకుంది.
న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా లాంఛనంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్కామ్ సంబంధ పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించాయి. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కోణాల్లో దర్యాప్తుపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. మొండి బాకీలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలతో కుదేలైన యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసి ఆర్‌బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్‌డ్రాయల్స్ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్‌బీఐ
తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఆర్‌బీఐ ట్వీట్ చేసింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్ క్యాప్ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు.
మాకు రూ. 662 కోట్లు రావాలి: ఇండియాబుల్స్ హౌసింగ్
యస్ బ్యాంక్ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్యాంక్ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశామని, టర్మ్ లోన్‌ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది.
డొల్ల కంపెనీలతో ముడుపుల మళ్లింపు...
రుణాల మంజూరుకు ప్రతిగా లభించిన ముడుపులను డజను పైగా డొల్ల కంపెనీల ద్వారా రాణా కపూర్ కుటుంబం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు, అత్యంత ఖరీదైన 44 పెయింటింగ్స్.. వాటి వెనుక ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాల కథనం ప్రకారం .. డీహెచ్‌ఎఫ్‌ఎల్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో కపూర్ కుటుంబానికి చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థలోకి డీహెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి దాదాపు రూ. 600 కోట్లు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రుణాలిచ్చినందుకు గాను కపూర్ కుటుంబానికి ఇవి ముడుపుల రూపంలో లభించి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి.
వీటన్నింటినీ ధృవీకరించుకోవడానికి కపూర్ కుటుంబ సభ్యులను కూడా విచారణ చేయాల్సి ఉందంటూ న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ డిఫాల్ట్ అయినప్పటికీ.. రుణాలను రాబట్టుకోవడానికి యస్ బ్యాంక్ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు ఊతమిస్తోందని పేర్కొంది. అయితే, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని.. కావాలనే కపూర్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. డూఇట్ కంపెనీ తన ఇద్దరు కుమార్తెల పేరు మీద ఉందని కపూర్ తెలిపారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నప్పుడు యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు రుణమిచ్చిందని, ఆ తర్వాత దాన్నుంచి డూఇట్ కంపెనీ రూ. 600 కోట్లు రుణం రూపంలో తీసుకుందని వివరించారు. ఇప్పటికీ డూఇట్ సంస్థ రుణాలను చెల్లిస్తూనే ఉందని, డిఫాల్ట్ కాలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment