న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడమా లేదంటే.. మరింత పతనం కావడమా అనే కీలక అంశం ఆధారపడి ఉందని దలాల్ స్ట్రీట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
వైరస్ భయాలతో.. మార్కెట్లో చురుగ్గా పాల్గొనే ఇన్వెస్టర్లు గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యూమ్స్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఎకాన మీపై ఈ మహమ్మారి ప్రభావం ఎంత మేర ఉండనుందనే అంశం ఆధారంగానే ఈ వారంలో సూచీలు కోలుకుంటాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు.
యస్ బ్యాంక్ పరిణామాలు కీలకం
గతవారంలో యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు బ్యాంక్‌పై ఆంక్షలతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. ఇక ఈ వారంలో కూడా యస్ బ్యాంక్ పరిణామాలు కీలకంకానున్నాయని జిమీత్ మోడీ అన్నారు.
మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అరెస్ట్ చేయగా.. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యస్ బ్యాంక్‌లో కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేశామని, విలీనం ప్రసక్తి ఇప్పటికి లేదని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తాజా పరిణామాలు, వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం క్లిష్టతరమేనని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా అన్నారు.
ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే..
హోలీ సందర్భంగా మంగళవారం (10న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది.
ఆర్థికాంశాల ప్రభావం..
జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం వెల్లడికానున్నాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి.
ఈ నెల్లో రూ. 13,157 కోట్లు వెనక్కి..
భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 13,157 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–6 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 8,997 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 4,160 కోట్లను వెనక్కు తీసుకున్నారు. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని గ్రోవ్ సహ వ్యవస్థాపకులు హర్‡్ష జైన్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment