న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్‌ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్‌టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి.
19నే సూచీల నుంచి నిష్క్రమణ..
తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది.
18 నుంచి పూర్తి సేవలు: ఆర్‌బీఐ
పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు.
కార్పొరేట్లకు ఈడీ సమన్లు..
యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్‌లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు.
యస్ బ్యాంక్ అప్‌గ్రేడ్ ..
తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది.
బోర్డు పునర్‌వ్యవస్థీకరణకు ఓకే ..
ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment